- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకునూరి ‘రిటర్న్’..? రాజీనామా తర్వాత మళ్లీ కమిషన్ కార్యకలాపాలు
మూడు వారాల క్రితం విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తన మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: మూడు వారాల క్రితం విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తన మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే ఆయన తిరిగి విధులకు హాజరవుతున్నట్లు డిస్కషన్ జరుగుతున్నది. రెండు రోజుల క్రితం కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ హోదాలో ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను పరిశీలించారనే చర్చ అధికారవర్గాల్లో ఉన్నది. అయితే మురళి మనస్సు మార్చుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందనే చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో జరుగుతోంది.
సర్ ప్రైజ్ డెసిషన్!
ఇంకా నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే ఆకునూరి మురళి మే 22న విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అందులో విద్యా కమిషన్ చైర్మన్ హోదాలో విద్యపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో తన బాధ్యత పూర్తయిందని పేర్కొన్నారు. కానీ మురళి రాజీనామా నిర్ణయం వెనుక విద్యాశాఖలోని కీలక అధికారి వ్యవహార తీరు కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఆ అధికారితో పలు అంశాల్లో విభేదాలు రావడం వల్ల ఇంకా అక్కడ కొనసాగడం బాగుండదనే నిర్ణయానికి వచ్చి రాజీనామా లేఖను చీఫ్ సెక్రెటరీకి పంపించారనే చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టింది. అయితే మురళి ఆదివారం కమిషన్ సభ్యులతో కలిసి ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన మోడల్ స్కూల్ ను పరిశీలించడంతో అందరు ఆశ్చర్యానికి గురయ్యారు.
రాజీనామా నిర్ణయాన్ని మురళి వెనక్కి తీసుకోవడానికి ఉన్న కారణాలు ఏమిటి? ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా? లేకపోతే మురళినే స్వయంగా తాను తీసుకున్న నిర్ణయాన్ని సవరించుకున్నారా? వివాదానికి కేంద్ర బిందువైన విద్యాశాఖ అధికారికి ప్రభుత్వం కౌన్సెలింగ్ ఇచ్చిందా? లేదా? అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి.






