ఆన్‌లైన్ మాయాజాలం పై అన్నదాతల ఆవేదన

by Batti.Sumithra |

ఆందోళన చెందవద్దు.. యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయి అంటూ వ్యవసాయ అధికారులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి.

ఆన్‌లైన్ మాయాజాలం పై అన్నదాతల ఆవేదన
X

దిశ, తాడ్వాయి : ఆందోళన చెందవద్దు.. యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయి అంటూ వ్యవసాయ అధికారులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి. అందుబాటులో ఉందన్న యూరియా క్షణాల్లో మాయమవుతుండటంతో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

సాంకేతిక తిప్పలు.. క్షణాల్లో మాయం

​మండలంలోని తాడ్వాయి సొసైటీ పరిధిలో గల ఎర్రపహాడ్ రైతు వేదికలో యూరియా అందుబాటులో ఉందని, నిర్ణీత సమయాల్లో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న కొందరు రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, సర్వర్ మొరాయించడంతో చాలాసేపు నెట్‌వర్క్ టైమ్ అవుట్ అని చూపిస్తూ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. తీరా అదృష్టం కొద్దీ సాంకేతిక సమస్య వీడి యాప్ ఓపెన్ అయ్యేసరికి, అందులో యూరియా నిల్వలు జీరో అని దర్శనమివ్వడంతో రైతులు ఒక్కసారిగా హడాలెత్తిపోయారు. ఆన్లైన్లో యూరియా పెట్టిన మారు క్షణాల్లోనే అయిపోతుంటే.... ఇదేం కర్మ అంటూ రైతులు నొసలు గుద్దుకుంటున్నారు.

సమాచార లోపం పై భిన్న వాదనలు..

​ఈ వ్యవహారం పై ఎర్రపహాడ్ గ్రామ రైతుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అసలు గ్రామంలో యూరియా అందుబాటులో ఉన్న విషయమే తమకు ముందస్తుగా సమాచారం లేదని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండానే నిల్వలు ఎలా ఖాళీ అవుతాయంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ​మరికొందరి వాదన ప్రకారం.. సొసైటీ వారు డబ్బులు ముందస్తుగా చెల్లించకపోవడం వల్లనే క్షేత్రస్థాయికి సరిపడా యూరియా రావడంలో తీవ్ర ఆలస్యం అవుతోందని, అధికారులు, సొసైటీల సమన్వయ లోపం వల్లే తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని మండిపడుతున్నారు.

వైన్స్‌కు లేని నిబంధనలు మాకెందుకు.?

​ఈ క్రమంలో ఒక రైతు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆవేదన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒక రైతు కేవలం ఒక్క యూరియా బస్తా బుక్ చేసుకోవాలన్నా యాప్‌లోనే నమోదు చేయాలనే నిబంధనలు పెట్టారు. మరి వైన్స్ షాప్ దగ్గర లేని నిబంధనలు, ఆంక్షలు.. కేవలం అన్నం పెట్టే రైతు యూరియా కొనుక్కోవడానికే ఎందుకు వర్తింపజేస్తున్నారు ? రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు.. కానీ రైతులంతా ఒక్కటే అంటూ సదరు రైతు వాట్సాప్ గ్రూపుల్లో తన గోడును వెళ్లబోసుకున్నాడు.

రైతుల డిమాండ్..

​ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, యాప్ సర్వర్ సమస్యలను శాశ్వతంగా అధిగమించాలని, సొసైటీల ద్వారా సకాలంలో క్షేత్రస్థాయికి యూరియా నిల్వలు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story