ఫ్లై యాష్ వినియోగంలో తెలంగాణ వెనుకంజ

by Muthe.Rajitha |   (  Updated:2026-03-26 01:57:18  IST  )

థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే ఫ్లై యాష్ వినియోగంలో తెలంగాణ వెనుకంజలో ఉందని కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ పేర్కొంది.

ఫ్లై యాష్ వినియోగంలో తెలంగాణ వెనుకంజ
X

దిశ, తెలంగాణ బ్యూరో: థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గును మండించడం ద్వారా ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్(బూడిద)ను ఒకప్పుడు వ్యర్థంగా పరిగణించేవారు. కాలక్రమేణా ఇది నిర్మాణ రంగానికి కీలక ముడి సరుకుగా, పర్యావరణ పరిరక్షణకు సహాయపడే వనరుగా, ప్రభుత్వాలకు ఆదాయాన్ని అందించే ఆర్థిక సంపదగా మారింది. దేశవ్యాప్తంగా బూడిదను సమర్థంగా వినియోగిస్తూ మౌలిక వసతుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుండగా, తెలంగాణ మాత్రం ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోలేకపోతోంది. కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దేశం దాదాపు 96 శాతం బూడిదను వినియోగిస్తున్నప్పటికీ, తెలంగాణలో ఈ శాతం 76.57కే పరిమితమవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని థర్మల్ ప్లాంట్ల పనితీరు తక్కువగా ఉండటం, పరిశ్రమలతో సమన్వయం లోపించడం, రవాణా సమస్యలు వంటి కారణాలతో రాష్ట్రం జాతీయ సగటుతో పోలిస్తే గణనీయంగా వెనుకబడినట్టు నివేదిక స్పష్టం చేస్తోంది.

తెలంగాణ పరిస్థితి ఇలా..

రాష్ట్రంలో 10 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉండగా, మొత్తం స్థాపిత సామర్థ్యం 9442.5 మెగావాట్లు. 2024-25లో 155.10 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్ఎంటీ) బూడిద ఉత్పత్తి కాగా.. అందులో కేవలం 118.77 ఎల్ఎంటీ మాత్రమే వినియోగించారు. రాష్ట్రంలో బూడిద మొత్తం వినియోగం 76.57 శాతం మాత్రమే. ఇది జాతీయ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. దేశవ్యాప్తంగా 214 గిగావాట్ల సామర్థ్యం గల 189 థర్మల్ ప్లాంట్లలో మొత్తం బూడిద ఉత్పత్తి 3187.98 ఎల్ఎంటీ కాగా.. వినియోగం 3071.38 ఎల్ఎంటీగా ఉంది. వినియోగ శాతం 96.34 అంటే దేశం దాదాపు పూర్తి స్థాయిలో బూడిదను ఉపయోగించుకుంటోంది. తెలంగాణ మాత్రం జాతీయ సగటుతో పోలిస్తే ఎంతో వెనకబడిపోయి ఆర్థిక వనరును సద్వినియోగం చేసుకోలేకపోతోందని సీఈఏ నివేదిక వెల్లడించింది. జాతీయ సగటు కంటే తెలంగాణ 20 శాతం తక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్లాంట్లలో వినియోగం కేవలం 68.87శాతమే ఉంటే.. రాష్ట్రంలోనే ఉన్న కేంద్ర ప్లాంట్లు(ఎన్టీపీసీ) మాత్రం 86.08 శాతంతో మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్ర రంగంలోనే ప్రధాన లోపం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలు 100 శాతం బూడిద వినియోగంతో దూసుకుపోతున్నాయి. ఇవి పాత బూడిద(లెగసీ యాష్)నూ ఉపయోగించి ఆదర్శంగా నిలిచాయి. మొత్తం 13 రాష్ట్రాలు ఏటా 10 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బూడిదను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో ఛత్తీస్‌గఢ్ అత్యధికంగా 49.79 మిలియన్ టన్నుల బూడిదను ఉత్పత్తి చేస్తోంది.

పిట్ హెడ్ వర్సెస్ నాన్ పిట్ హెడ్

బొగ్గు గనుల సమీపంలో ఉండే ప్లాంట్లను పిట్ హెడ్ ప్లాంట్లు అని, దూరంగా ఉండే వాటిని నాన్-పిట్ హెడ్ అని అంటారు. పిట్ హెడ్ ప్లాంట్లలో వినియోగం 89.36 శాతంగా ఉంది. ఇక్కడ రోడ్ల నిర్మాణం(66శాతం) ప్రధాన వినియోగ మార్గంగా ఉంది. నాన్-పిట్ హెడ్ ప్లాంట్లలో 98.55 శాతంతో అత్యధిక వినియోగం కనిపిస్తోంది. ఇక్కడ సిమెంట్ తయారీ(35శాతం) ద్వారా బూడిద ఎక్కువగా వినియోగిస్తున్నారు.

బూడిద ఉపయోగం ఎందుకు కీలకం?

ఫ్లై యాష్ వినియోగం అనేక రంగాలకు కీలకంగా ఉంది. రోడ్ల నిర్మాణంలో బలమైన బేస్ మెటీరియల్‌గా బూడిద పనిచేస్తోంది. ఇటుకల తయారీలో మట్టి వినియోగం తగ్గించేందుకు, సిమెంట్ పరిశ్రమలో ఖర్చు తగ్గింపునకూ ఫ్లై యాష్ కీలకం. ఫలితంగా పర్యావరణ కాలుష్యం తగ్గింపునకు అవకాశం ఏర్పడుతుంది. అంటే ఇది వ్యర్థం కాదు విలువైన నిర్మాణ వనరు అని చెప్పవచ్చు.

దేశం, రాష్ట్రంలో బూడిద వినియోగం ఇలా..

తెలంగాణ దేశవ్యాప్తంగా

రోడ్లు 28.63% 34%

ఇటుకలు 28.21% 30%

సిమెంట్ 23.96% 28%

రాష్ట్రం ఎందుకు వెనుకబడింది?

బూడిదను ప్లాంట్ల నుంచి పరిశ్రమలకు తరలించేందుకు సరైన లాజిస్టిక్స్ లేకపోవడం రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉంది. సిమెంట్, ఇటుక పరిశ్రమలతో సమన్వయం తక్కువగా ఉండటం కనిపిస్తోంది. కేంద్ర మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థాయిలో కఠినంగా అమలు కాకపోవడం సమస్యగా మారింది. పాత బూడిద నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల వినియోగం మందగించింది. ఫ్లై యాష్ ప్రయోజనాలపై చిన్న పరిశ్రమలకు సరైన అవగాహన లేకపోవడం బూడిద వినియోగం తగ్గడానికి కారణాలు.

సద్వినియోగం చేసుకోవాలంటే..

సిమెంట్, రోడ్ల నిర్మాణ రంగాలతో ఒప్పందాలు పెంచాలి. బూడిద రవాణాకు సబ్సిడీలు ఇవ్వాలని కన్‌స్ట్రక్షన్ కంపెనీలు కోరుతున్నాయి. పాత బూడిద వినియోగంపై ప్రత్యేక ప్రణాళికలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్లాంట్ల పనితీరును మెరుగుపరచాలి. సరైన విధానాలు, సమన్వయం ఉంటే బూడిద రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story