సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి: ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాధనం ఖర్చు చేస్తూ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జాగృతి నాయకులు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి: ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాధనం ఖర్చు చేస్తూ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జాగృతి నాయకులు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్‌సింగ్ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రెటరీ లింగ్యా నాయక్ కు ఫిర్యాదు లేఖ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో సీఎం మిర్యాలగూడలో మీటింగ్ పెట్టారని.. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ఆ మీటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన కోరారని పేర్కొన్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. ఈ ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా ప్రజలను ఓటు వేయాలని కోరేందుకు పార్టీ పరంగా మీటింగ్‌లు పెట్టుకోవాలని.. ప్రభుత్వ కార్యక్రమంలో ఇలా ప్రజలను మోసం చేసే విధానాన్ని విరమించుకోవాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లోనూ సీఎం ఇదే విధంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని.. అప్పుడు తమ సంస్థ అధ్యక్షురాలు కవిత స్వయంగా ఈసీని కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం దురదృష్టకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, నరేష్ ప్రజాపతి, కోల శ్రీనివాస్, నరేందర్ యాదవ్, మరిపెల్లి మాధవి తదితరులు పాల్గొన్నారు.

Next Story