TG: బహిరంగ క్షమాపణ చెప్పాలి.. ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్

by Gantepaka Srikanth |

మహిళా ఐఏఎస్ అధికారులపై ఆధారంలేని, అసత్య ఆరోపణలతో ఇటీవల ఓ టీవీ చానెల్‌లో ప్రసారమైన కార్యక్రమాన్ని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.

TG: బహిరంగ క్షమాపణ చెప్పాలి.. ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా ఐఏఎస్ అధికారులపై ఆధారంలేని, అసత్య ఆరోపణలతో ఇటీవల ఓ టీవీ చానెల్‌లో ప్రసారమైన కార్యక్రమాన్ని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తప్పుడు కథనాల ద్వారా మహిళా ఐఏఎస్ అధికారులపై కావాలనే అపవాదులు మోపుతూ, వారి పోస్టింగుల చట్టబద్ధతపై అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం జరిగిందని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. “ఫ్యామిలీ డిస్కంఫర్ట్”, ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్స్ అంటూ చూపిన అంశాలన్నీ పూర్తిగా కల్పితమైనవి, నిరాధారమైనవి, వాస్తవాలకు దూరమైనవని స్పష్టం చేసింది. ధృవీకరణ లేకుండా ఇలాంటి కంటెంట్‌ను ప్రసారం చేయడం మహిళా అధికారులపై వ్యక్తిత్వ హననం, వేధింపులకు సమానమని పేర్కొంది. పోస్టింగుల విషయంలో మహిళా ఐఏఎస్ అధికారులకు ‘కంఫర్ట్ పోస్టింగ్స్’ ఇచ్చారన్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు వని, అవి ప్రభుత్వ పరిపాలనా విధానాలను వక్రీకరించి చూపించే ప్రయత్నమని సంఘం ఆరోపించింది. ఇటువంటి కథనాలు సివిల్ సర్వీసుల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, రాజ్యాంగబద్ధ పరిపాలనా వ్యవస్థపై అనవసరమైన అపనిందలు మోపుతాయని హెచ్చరించింది.

సదరు టీవీ ప్రసారం తరువాత అదే కంటెంట్‌ను ఇతర మీడియా వేదికలు కూడా పునఃప్రసారం చేయడం, ప్రచారం చేయడం వల్ల మహిళా అధికారులకు కలిగిన నష్టం మరింత పెరిగిందని సంఘం పేర్కొంది. ఈ విధమైన బాధ్యతారహిత, అనైతిక జర్నలిజాన్ని అన్ని మీడియా సంస్థలు తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించింది. ప్రసారంలో వచ్చిన ఆరోపణలు పూర్తిగా అసత్యాలు దురుద్దేశపూరితమైనవని, మహిళా అధికారుల గోప్యత, గౌరవం, వృత్తిపరమైన ప్రతిష్ఠపై ఇది తీవ్రమైన దాడి అని, ఈ కంటెంట్ మహిళలపై ద్వేషభావం, వివక్షను ప్రతిబింబిస్తుందని, ఇటువంటి ప్రచారం సివిల్ సర్వీసులను అవమానపరుస్తూ, పాలనపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదముందని సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో సదరు టీవీ ఛానెల్ తో పాటు సంబంధిత అన్ని మీడియా సంస్థలు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, వివాదాస్పద కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించాలని ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. అంతేకాకుండా, ఈ అపవాద కంటెంట్‌కు బాధ్యులైన వారిపై పౌర, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని స్పష్టం చేసింది. తప్పుడు కథనాల ద్వారా సేవలో ఉన్న అధికారులను దూషించే ఏ ప్రయత్నాన్నైనా సంస్థాగతంగా, కఠినంగా ఎదుర్కొంటామని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ స్పష్టం చేశారు.

Next Story