లైంగిక వేధింపుల కేసులో టీసీఎస్ కఠిన నిర్ణయం.. ‘డెలాయిట్’తో స్వతంత్ర విచారణ

by Malleboina Mahesh |

టీసీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం! స్వతంత్ర పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసిన యాజమాన్యం. నిదాఖాన్ హెచ్ఆర్ కాదని, ప్రాసెస్ అసోసియేట్ మాత్రమేనని సంస్థ వెల్లడి.

లైంగిక వేధింపుల కేసులో టీసీఎస్ కఠిన నిర్ణయం.. ‘డెలాయిట్’తో స్వతంత్ర విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నాసిక్ టీసీఎస్ (TCS) బిపిఓ యూనిట్‌లో వెలుగులోకి వచ్చిన లైంగిక వేధింపుల ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం కారణంగా టీసీఎస్ కు భారీ ఎఫెక్ట్ పడింది. టీసీఎస్ నింధితులను కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ.. దేశంలోని అన్ని టీసీఎస్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై టీసీఎస్ యాజమాన్యం (TCS Management) కీలక నిర్ణయాలు తీసుకుంది. నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో జరిగిన లైంగిక వేధింపులు (Sexual harassment), మతపరమైన ఒత్తిళ్ల ఆరోపణలపై టీసీఎస్ యాజమాన్యం శనివారం (ఏప్రిల్ 18, 2026) కీలక ప్రకటన చేసింది.

ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపేందుకు సంస్థ ఒక స్వతంత్ర పర్యవేక్షణ కమిటీని (Oversight Committee) ఏర్పాటు చేసింది. దీనికి స్వతంత్ర డైరెక్టర్ కేకి మిస్త్రీ నేతృత్వం వహిస్తుండగా, అంతర్గత దర్యాప్తుకు సహాయపడేందుకు అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ (Deloitte), లా సంస్థ ట్రైలీగల్ (Trilegal) ప్రతినిధులను స్వతంత్ర సలహాదారులుగా నియమించింది. ఇప్పటికే ఈ కేసులో బాధితుల ఫిర్యాదుల మేరకు 9 ఎఫ్ఐఆర్ (FIR) లు నమోదు కాగా, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సంస్థ సస్పెండ్ చేసింది.

ఈ కేసులో ప్రధాన నిందితురాలు అయిన నిదాఖాన్ (Nidakhan) పాత్రపై టీసీఎస్ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. ఆమె హెచ్ఆర్ (HR) మేనేజర్ కాదని, కేవలం ప్రాసెస్ అసోసియేట్ (Process Associate) గా మాత్రమే పనిచేస్తోందని సంస్థ వెల్లడించింది. ఆమెకు రిక్రూట్‌మెంట్, నాయకత్వ బాధ్యతలు ఏవీ లేవని తెలిపింది. మరోవైపు, పరారీలో ఉన్న నిదా ఖాన్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా, ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే నాసిక్ యూనిట్ మూసివేస్తున్నారన్న వార్తలను టీసీఎస్ ఖండించింది. ఆపరేషన్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేస్తూనే, మహిళా ఉద్యోగుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చింది.

Next Story