- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీ20 లీగ్ ఆడిట్ ఖాతాలు వెంటనే వెల్లడించాలి: టీసీఏ
పరిపాలనా రికార్డులను వెంటనే హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, సికింద్రాబాద్: సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాజ్యాంగంలోని రూల్ 37(2) ప్రకారం టీజీ20 లీగ్‌కు సంబంధించిన ఆడిట్ ఖాతాలు, ఆర్థిక నివేదికలు, పరిపాలనా రికార్డులను వెంటనే హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు హెచ్‌సీఏ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సింగిల్ మెంబర్ కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) పి. నవీన్ రావుకు వినతిపత్రం సమర్పించినట్లు ఒక ప్రకటన లో తెలిపారు. దాని ప్రతులను హెచ్‌సీఏ కార్యదర్శి, తాత్కాలిక అధ్యక్షుడు, తాత్కాలిక సీఈఓ, కోశాధికారి, జాయింట్ సెక్రటరీ, టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, ప్లేయర్స్ ప్రతినిధులకు పంపినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ.. రూల్ 37(2) ప్రకారం ప్రతి క్రికెట్ సంఘం తన ఆడిట్ చేసిన ఆర్థిక లెక్కలు, వార్షిక నివేదికలు, కీలక పరిపాలన పత్రాలు ప్రజలకు అందుబాటులో ఉంచడం తప్పనిసరి అయినప్పటికీ, టీజీ20 లీగ్ విషయంలో హెచ్‌సీఏ ఈ నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. టీజీ20 లీగ్‌కు సంబంధించిన ఆడిట్ ఖాతాలు, బ్యాలెన్స్ షీట్లు, ఫ్రాంచైజీ, స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు, ఆదాయ వ్యయ వివరాలు, టెండర్లు, కొనుగోలు రికార్డులు, గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాలు, బీసీసీఐ అనుమతి పత్రాలను వెంటనే బహిర్గతం చేయాలని కోరారు.
టీసీఏ గతంలో లేవనెత్తిన ప్రశ్నలకు హెచ్‌సీఏ ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదని, రూల్స్ 28, 30 ప్రకారం అవసరమైన బీసీసీఐ అనుమతులు, హెచ్‌సీఏ జనరల్ బాడీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదాలకు సంబంధించిన పత్రాలను కూడా వెల్లడించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రూల్ 31 ప్రకారం చర్యలు తీసుకోవాలని టీసీఏ ఇప్పటికే కోరినట్లు తెలిపారు. హెచ్‌సీఏ ప్రకటించిన వివరాల ప్రకారం టీజీ20 లీగ్ కోట్ల రూపాయల నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ, ఆర్థిక లావాదేవీల వివరాలను ప్రజలకు వెల్లడించక పోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సీఐడీ, ఏసీబీ, ఈడీ వంటి సంస్థలు హెచ్‌సీఏ వ్యవహారాలపై దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో పూర్తి ఆర్థిక పారదర్శకత అవసరమని అభిప్రాయపడ్డారు.
అలాగే 2021లో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ హెచ్‌సీఏ, టీసీఏ కలిసి హైదరాబాద్ వెలుపల క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించినప్పటికీ, టీజీ 20 నిర్వహణలో టీసీఏకు ప్రాతినిధ్యం కల్పించలేదని ధరం గురువారెడ్డి ఆరోపించారు. తెలంగాణ జిల్లాల పేర్లను ఉపయోగించుకుంటూనే గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన క్రికెటర్లకు సమాన అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. టీజీ20 లీగ్‌కు సంబంధించిన అన్ని ఆడిట్ ఖాతాలు, ఆర్థిక నివేదికలు, పరిపాలనా రికార్డులను వెంటనే హెచ్‌సీఏ వెబ్‌సైట్‌లో ప్రచురించేలా సింగిల్ మెంబర్ కమిటీ జోక్యం చేసుకోవాలని టీసీఏ విజ్ఞప్తి చేసింది. క్రికెట్ పరిపాలనలో పారదర్శకత తప్పనిసరి అని, రాజ్యాంగ నిబంధనల అమలు ప్రతి క్రికెట్ సంస్థ బాధ్యత అని గురువారెడ్డి స్పష్టం చేశారు.






