- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళిసై ఇన్.. అన్నామలై ఔట్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపు గుర్రాల వేట మొదలైంది.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపు గుర్రాల వేట మొదలైంది. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP), తమకు కేటాయించిన 27 స్థానాలకు సంబంధించిన పూర్తి అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ అగ్రనాయకత్వం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్రమంత్రి ఎల్. మురుగన్‌ను అవనాశి (ఎస్సీ రిజర్వ్డ్) నియోజకవర్గం నుండి బరిలోకి దింపడం ద్వారా ఆ ప్రాంతంలోని దళిత ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తోంది. అలాగే, తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ గా పనిచేసి.. అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై సౌందర రాజన్‌ను చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన మైలాపూర్ నియోజకవర్గం నుండి పోటీకి నిలబెట్టడం విశేషం. గవర్నర్ వంటి అత్యున్నత పదవిని వదిలి సామాన్య అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే బీజేపీ జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తమిళనాడు బీజేపీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై ఈసారి ఎన్నికల బరిలో నిలబడకపోవడం. తన తండ్రి అనారోగ్యం దృష్ట్యా ఆయనకు సమయం కేటాయించాల్సి ఉందని, అందుకే తనకు పోటీ నుండి మినహాయింపు ఇచ్చి కేవలం ప్రచార బాధ్యతలే అప్పగించాలని ఆయనే స్వయంగా అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. అయినప్పటికీ, ఆయన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్‌ను ఈసారి కోయంబత్తూర్ నార్త్ నుండి పోటీకి నిలపడం, నైనార్ నాగేంద్రన్‌ను సాత్తూరు నుండి బరిలోకి దింపడం ద్వారా బిజెపి తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. అన్నాడీఎంకేతో కలిసి సాగుతున్న ఈ కూటమి, ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌లో డీఎంకే కోటను బద్దలు కొడుతుందో లేదో చూడాలి.






