సర్వేయర్ ఆస్తులు రూ.6 కోట్లు.. షాక్ తిన్న ఏసీబీ అధికారులు

by Muthe.Rajitha |

ఏపీలో మరో భారీ అవినీతి అధికారి గుట్టు బయట పడింది.

సర్వేయర్ ఆస్తులు రూ.6 కోట్లు.. షాక్ తిన్న ఏసీబీ అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో మరో భారీ అవినీతి అధికారి గుట్టు బయట పడింది. ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు రూ.6 కోట్లు ఉండటం చూసి ఏసీబీ అధికారులే షాక్ తిన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గనుల శాఖ కార్యాలయంలో సర్వేయర్–2గా విధులు నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ అక్రమ సంపాదనపై ఏసీబీ మెరుపు దాడులు చేపట్టింది. ఐదు ప్రత్యేక బృందాలతో శుక్రవారం రోజంతా సాగిన ఈ తనిఖీల్లో సుమారు ఆరు కోట్ల రూపాయల విలువైన స్థిర, చర ఆస్తులను అధికారులు గుర్తించారు.

అబ్దుల్ ఆసిఫ్ ప్రస్తుతం ఒంగోలులో విధులు నిర్వహిస్తుండగా.. ఆయన స్వగ్రామమైన మార్కాపురం, కనిగిరి ప్రాంతాలతో పాటు, గతంలో ఉద్యోగం చేసిన నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనూ, ప్రస్తుతం కుటుంబంతో నివసిస్తున్న విజయవాడలోనూ సోదాలు నిర్వహించారు. ఒంగోలులో ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు, అతడిని విజయవాడలోని నివాసానికి తీసుకెళ్లి అక్కడ కూడా క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. ప్రతి చోటా బయటపడుతున్న ఆస్తుల జాబితా చూసి అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఏసీబీ తనిఖీల్లో ఆసిఫ్ పేరిట రెండు నివాస అపార్ట్‌మెంట్లు, ఒక ప్లాటు, 22 ఎకరాల సాగుభూమి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా ఇంట్లో నుంచి రూ.2.82 లక్షల నగదు, 620 గ్రాముల బంగారు ఆభరణాలు, దాదాపు అరకిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రూ.3.54 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, 16 ఖరీదైన గడియారాలు, రూ.15 లక్షల వరకు బీమా పాలసీలు కూడా లభించాయి. అదనంగా, ఒక కారు కొనుగోలుకు ముందస్తుగా భారీ మొత్తంలో అడ్వాన్స్ చెల్లించిన విషయం కూడా దర్యాప్తులో వెల్లడైంది.

ఒక సాధారణ సర్వేయర్ స్థాయి ఉద్యోగికి ఈ స్థాయిలో ఆస్తులు ఎలా సమకూరాయన్న అంశంపై అధికారులు లోతైన విచారణ చేపట్టారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన సంపదపై పూర్తి వివరాలు సేకరించి, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. గనుల శాఖలోని అవినీతి తంతుపై ఈ ఘటన మరోసారి ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రభుత్వ శాఖల్లో నిజాయితీ, పారదర్శకత పెంచేందుకు ఇలాంటి దాడులు మరింత అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story