వివాహితకు ‘పెళ్లి హామీ’ వర్తించదు.. ఆ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు

by Malleboina Mahesh |

జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పెళ్లిహామి, రేప్ కేసును నిశితంగా పరిశీలించి ఈ క్రింది కీలక అంశాలను లేవనెత్తారు. హిందూ వివాహ చట్టం ప్రకారం, భర్త జీవించి ఉన్నప్పుడు, విడాకులు తీసుకోకుండా మరో వివాహం చేసుకోవడానికి మహిళకు చట్టబద్ధమైన అర్హత ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వివాహితకు ‘పెళ్లి హామీ’ వర్తించదు.. ఆ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఆరోపిస్తూ.. వందల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇందులో రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు కూడా ఉంటున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. సహజీవనం, పెళ్లి హామీలపై సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. ఇప్పటికే వివాహమై, భర్తతో బంధం కొనసాగిస్తున్న మహిళకు మరొకరు ఇచ్చిన ‘పెళ్లి హామీ’ చట్టబద్ధం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశారంటూ ఒక మహిళా న్యాయవాది దాఖలు చేసిన కేసును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

హర్యానాకు చెందిన ఒక మహిళా న్యాయవాది, ఒక వ్యక్తితో కొంతకాలం పాటు సంబంధం కొనసాగించారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు వ్యక్తి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని అత్యాచారంగా పరిగణించాలని ఆమె కోరారు. అయితే, సదరు మహిళకు అప్పటికే వివాహం జరిగిందని, ఆమెకు భర్త ఉన్నాడనే విషయాన్ని విచారణలో గుర్తించారు.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ కేసును విచారించిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును నిశితంగా పరిశీలించి ఈ క్రింది కీలక అంశాలను లేవనెత్తారు. హిందూ వివాహ చట్టం ప్రకారం, భర్త జీవించి ఉన్నప్పుడు, విడాకులు తీసుకోకుండా మరో వివాహం చేసుకోవడానికి మహిళకు చట్టబద్ధమైన అర్హత ఉండదు. ఇద్దరి మధ్య సంబంధం పరస్పర అంగీకారంతోనే సాగిందని, అది విఫలమైన తర్వాత దానిని అత్యాచారంగా చిత్రీకరించలేమని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ఇద్దరి సంబంధం సజావుగా సాగినంత కాలం మౌనంగా ఉండి గొడవలు రాగానే రేప్ కేసు పెట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని ధర్మాసనం పేర్కొంది.

పెళ్లి చేసుకునే అవకాశం లేని పరిస్థితుల్లో అవతలి వ్యక్తి ఇచ్చిన హామీని నమ్మడం చెల్లదని, ఇది కేవలం విఫలమైన బంధమే తప్ప నేరం కాదని పేర్కొంటూ నిందితుడిపై ఉన్న ఎఫ్ఐఆర్‌ను కోర్టు రద్దు చేసింది. కాగా నేడు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల తీర్పు ఎన్నో కేసులకు మార్గదర్శం అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Next Story