"ఇంట్లో ఖాళీగా ఉంటే ఇలాంటి పిటిషన్లు వేస్తారా?": సుప్రీంకోర్టులో 'టీమ్ ఇండియా' పేరు వివాదంపై అసహనం!

by Malleboina Mahesh |

బీసీసీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత క్రికెట్ జట్టును టీం ఇండియా అని పిలవద్దని, ఈ మేరకు భారతికి ఆదేశాలివ్వాలని ఓ పిటిషనర్ సుప్రీం కోర్టును కోరారు.

ఇంట్లో ఖాళీగా ఉంటే ఇలాంటి పిటిషన్లు వేస్తారా?: సుప్రీంకోర్టులో టీమ్ ఇండియా పేరు వివాదంపై అసహనం!
X

దిశ, వెబ్ డెస్క్: బీసీసీఐ (BCCI) ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత క్రికెట్ జట్టును టీం ఇండియా (Team India) అని పిలవద్దని, ఈ మేరకు ప్రసార భారతి (Prasar Bharati)కి ఆదేశాలివ్వాలని ఓ పిటిషనర్ సుప్రీం కోర్టు (Supreme Court)ను కోరారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "ఇంట్లో ఖాళీగా కూర్చుని ఇలాంటి అర్థరహితమైన పిటిషన్లు రాయొద్దు.. కోర్టులపై భారం మోపొద్దు" అంటూ పిటిషనర్‌కు చురకలంటించింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం తరఫున ఆడుతున్న జట్టును టీం ఇండియా అని పిలవడంలో తప్పేముందని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించింది.

కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆమోదం, సుప్రీంకోర్టు పర్యవేక్షణ ఉన్న బీసీసీఐ జట్టును అధికారిక భారత ప్రతినిధిగా గుర్తించడంలో ఎటువంటి సందేహం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ న్యాయస్థానాల సమయాన్ని వృథా చేయడమేనని పేర్కొంటూ, గతంలో ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేయడమే కాకుండా భారీ జరిమానా వేయకపోవడమే పిటిషనర్‌ను ప్రోత్సహించినట్లు అయిందని అభిప్రాయపడింది. తొలుత ₹10 లక్షల జరిమానా విధించాలని భావించినప్పటికీ, చివరకు పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ వివాదానికి తెరదించింది.

Next Story