- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉడికి ఉడకని అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థుల ఫిర్యాదు
నర్వ మండల కేంద్రంలోని జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గురువారం పరిశీలించారు.

దిశ, నర్వ : నర్వ మండల కేంద్రంలోని జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉడికి ఉడకని అన్నం, నాసిరకం కూరలను విద్యార్థులకు వడ్డిస్తున్నారని విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు స్వయంగా భోజనాన్ని పరిశీలించగా, అన్నం సరిగా ఉడకలేదని, కూర నాణ్యత కూడా సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉడకని అన్నాన్ని తినలేక కొంతమంది విద్యార్థులు చెత్తకుండీలో పారబోస్తున్నారని, పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన తర్వాతే భోజనం చేస్తున్నామని విద్యార్థులు వాపోయినట్లు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతమైతే ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు సహకరించాలని, విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ సభ్యులు నరేష్, మహేష్, వహీద్, వర్మ, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






