- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యూర్ పరిధిలో విచిత్ర పరిస్థితి.. అప్పుల ఊబిలో జీహెచ్‌ఎంసీ!
ఆదాయంలో దూసుకుపోతున్న కొత్త కార్పొరేషన్లు; సీఎంసీ ఎఫ్‌డీలు రూ.200 కోట్లు, ఎంఎంసీ ఎఫ్‌డీలు రూ.150 కోట్లు.. జీహెచ్‌ఎంసీ అప్పులు రూ.4,717 కోట్లు!

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఆదాయంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. అయితే కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) మిగులు బడ్జెట్‌గా మారాయి. అదే జీహెచ్ఎంసీ మాత్రం అప్పుల కుప్పగా మారింది. ఇప్పటికే సీఎంసీ రూ.200 కోట్లు, ఎంఎంసీ రూ.150 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాయి. అదే జీహెచ్ఎంసీ రూ.4,500 కోట్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయింది. అయితే జీహెచ్ఎంసీ అప్పులను ప్రభుత్వం టేకోవర్ చేసుకుంటుందని అధికారులు భావించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సైతం రూపొందించారు. కానీ అందుకు ప్రభుత్వం నిరాకరించింది. దీంతో జీహెచ్ఎంసీ అప్పులను చెల్లిస్తూనే ఉంది.
ఫిక్స్డ్ డిపాజిట్లు
క్యూర్ పరిధిలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) ఎర్లీబర్డ్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో రూ.500 కోట్లు వసూలు చేసింది. ఎంఎంసీ రూ.260 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా సీఎంసీ పరిధిలో ఐటీ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, బహుళ అంతస్తుల భవనాలు ఎక్కువగా ఉండడంతో ఆదాయం భారీ స్థాయిలో వస్తుంది. దీంతోపాటు రియల్ ఎస్టేట్ పరంగానూ పొటెన్షియల్ ఉన్న ఏరియా. దీంతోపాటు ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్స్, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్స్ (ఓసీ)ల ద్వారా భారీగానే ఆదాయం వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఏరియాలో సైతం టౌన్ ప్లానింగ్ ద్వారా ఆశించిన స్థాయిలోనే ఆదాయం వస్తోంది. నెలవారిగా ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు, చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు పోను మిగిలిన నిధులను బ్యాంకుల్లో జమ చేసారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల ఆధారంగా భవిష్యత్‌లో అప్పులు తీసుకోవడానికి అవకాశముంది.
పదేండ్లలో నామమాత్రపు చెల్లింపులే
2017 తర్వాత జీహెచ్ఎంసీకి సర్కార్ నుంచి ఎలాంటి సాయం అందలేదు. రూ.6 వేల కోట్ల అప్పులు చేసి ఫ్లైఓవర్లు నిర్మించారు. ప్రస్తుతం అప్పులు రూ.4,717 కోట్లకు చేరాయి. అయితే ఈ అప్పులను ప్రభుత్వం టేకోవర్ చేసుకుంటుందనే ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు అప్పులకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. కానీ ప్రభుత్వం మాత్రం అప్పులను టేకోవర్ చేసుకోవడానికి సిద్ధంగా లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఒక వేళ అప్పులను టేకోవర్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణ పరిమితి పై ప్రభావం పడే అవకాశాలున్నందున బల్దియాకు రావాల్సిన బకాయిలను చెల్లించాలనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలను ఓటీఎస్ ద్వారా ఏడాదిలో రూ.1686.39 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నిధుల సమీకరణ
సీఎంసీ పరిధిలో సుమారు రూ.2,500 కోట్ల భారీ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన బిల్లులను చెల్లించడానికి బాండ్ల ద్వారా నిధులు సమీకరించాలని ప్రభుత్వం అనుమతిచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఫిక్స్డ్ డిపాజిట్ లతోపాటు ఆస్తుల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూముల లీజులు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయ మార్గాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టుల పనులు పూర్తయ్యే పరిస్థితి బట్టి బిల్లులు చెల్లించడానికి బాండ్ల ద్వారా నిధులు సమీకరించాలని అధికారులు నిర్ణయించారు. ఎంఎంసీలో సైతం ఇదే తరహాలో నిధులను సమీకరించాలని అధికారులు నిర్ణయించారు.
అప్పుల్లో జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీ అంటేనే ఫిక్స్డ్ డిపాజిట్ల(పీడీ) కు పెట్టింది పేరు. 2013 వరకు ముందు జీహెచ్ఎంసీ పేరు మారుమోగింది. బల్దియాలో ఖజానాలో రూ.1000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు (పీడీ) ఉండేవి. తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎం సీ నిధులను ఇతర శాఖలకు మళ్లించడంతో ఖజానా ఖాళీ అయింది. ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ)కి చేరింది. అదనపు నిధులతో కళకళలాడిన జీహెచ్ఎంసీ అప్పుల ఊబిలోకి నెట్టబడింది.






