సృష్టికి మూలం "అమ్మ".. హ్యాపీ మదర్స్ డే

by Muthe.Rajitha |

మదర్స్ డే ఎలా వచ్చింది? ఈ సందర్భంగా అమ్మ మన జీవితంలో పోషించే గొప్ప పాత్రపై స్పెషల్ స్టోరీ..

సృష్టికి మూలం అమ్మ.. హ్యాపీ మదర్స్ డే
X

దిశ, వెబ్ డెస్క్ : అమ్మ అనే రెండక్షరాల పదంలో అనంతమైన ప్రేమ, అంతులేని త్యాగం దాగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారాన్ని 'మదర్స్ డే' లేదా 'మాతృ దినోత్సవం'గా జరుపుకుంటాం. అసలు ఈ మదర్స్ డే ఎలా వచ్చింది? ఈ సందర్భంగా అమ్మ మన జీవితంలో పోషించే గొప్ప పాత్రపై స్పెషల్ స్టోరీ..

అమ్మ : సృష్టికి మూలం.. ప్రేమకు నిర్వచనం

లోకంలో ఏ బంధమైనా ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తుంది. కానీ ఎటువంటి స్వార్థం లేకుండా లభించే ఏకైక బంధం 'అమ్మ ప్రేమ'. బిడ్డ కడుపులో పడిన క్షణం నుండి తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చే అమ్మ, బిడ్డ ఎదుగుదల కోసం తన ఇష్టాలను, సుఖాలను సంతోషంగా త్యాగం చేస్తుంది. అందుకే "నడిచే దేవత" అన్న మాటకు అమ్మే అసలైన నిదర్శనం.

"మదర్స్ డే" నేపథ్యం

ఆధునిక కాలంలో "మదర్స్ డే" వేడుకలు అమెరికాకు చెందిన అన్నా జార్విస్ కృషితో ప్రారంభమయ్యాయి. తన తల్లి ఆశయాలను గౌరవిస్తూ, తల్లులందరి సేవలను గుర్తించాలని ఆమె పోరాడారు. ఫలితంగా 1914లో అమెరికా ప్రభుత్వం మే నెల రెండో ఆదివారాన్ని అధికారికంగా మాతృ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుండి ఈ సంప్రదాయం ప్రపంచమంతటా విస్తరించింది.

కుటుంబానికి వెన్నెముక

ఒక ఇల్లు 'ఇల్లాలి' వల్లనే 'ఇల్లు పరిపూర్ణం' అవుతుంది. ఉదయం అందరికంటే ముందు నిద్రలేచి, రాత్రి అందరూ పడుకున్నాక విశ్రమించే అమ్మ, ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలను కనిపెట్టుకుని చూస్తుంది. నాన్న ఆర్థికంగా అండగా నిలిస్తే, అమ్మ మానసికంగా ధైర్యాన్ని ఇస్తుంది. బిడ్డలకు తొలి గురువు అమ్మే. నడకతో పాటు నడవడికను, మాటలతో పాటు మర్యాదను నేర్పేది మాతృమూర్తే.

అమ్మకు మనం ఇచ్చే బహుమతి ఏంటి?

ఈ రోజుల్లో చాలామంది మదర్స్ డే అంటే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం, ఖరీదైన బహుమతులు ఇవ్వడం అనుకుంటారు. కానీ, నిజానికి అమ్మకు కావాల్సింది అవి కాదు. రోజులో కనీసం పది నిమిషాలు అమ్మతో ప్రశాంతంగా మాట్లాడాలి. ఆమె అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ఆమె మన కోసం చేస్తున్న పనులను గుర్తించి, ఒక్క 'థాంక్స్' చెబితే ఆ ముఖంలో వచ్చే సంతోషాన్ని దేనితోనూ వెలకట్టలేమని గుర్తు పెట్టుకోండి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను భారంగా భావించకుండా, కంటికి రెప్పలా చూసుకోవడమే మనం ఇచ్చే అసలైన కానుక. "అమ్మ" అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, అది ఒక అనుభూతి. మన గెలుపులో తను సంతోషిస్తుంది. ఓటమిలో ధైర్యం బాధను పంచుకొని, దైర్యం చెబుతుంది. ప్రతి రోజూ అమ్మను గౌరవించే వారికి ప్రత్యేకంగా ఒక్క రోజంటూ అక్కర్లేదు, కానీ ఆమె త్యాగాలను స్మరించుకోవడానికి ఈ మదర్స్ డే ఒక మంచి సందర్భం. ఈ మదర్స్ డే రోజున మీ అమ్మను గట్టిగా హత్తుకుని, ఆమెపై మీకున్న ప్రేమను తెలియజేయండి.


"అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!"

Next Story