ఆ పనులు చేశానని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా: కడియం శ్రీహరి

by Batti.Sumithra |

ఎవరికైనా పనులు ఇప్పిస్తాననో, పథకాలు ఇప్పిస్తాననో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ చేశారు.

ఆ పనులు చేశానని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా: కడియం శ్రీహరి
X

దిశ, ధర్మసాగర్ : నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరికైనా పనులు ఇప్పిస్తాననో, పథకాలు ఇప్పిస్తాననో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా, ఇక్కడికిక్కడే నా పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ చేశారు. జఫర్‌గడ్ మండలం తమ్మడపల్లి (జీ) గ్రామంలో హెల్త్ సెంటర్, సీసీ కెమెరాలు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళల స్వయం ఉపాధి కూరగాయల నమూనా షెడ్డు, సీసీ రోడ్లు, వైకుంఠ రథం, రచ్చబండ తదితర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు, డీజే పాటలతో గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి కోలాటం ఆడి కాసేపు సందడి చేశారు.

ఆ తర్వాత ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. అనంతరం తీగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. అలాగే తమ్మడపల్లి (జీ) గ్రామానికి చెందిన పదో తరగతి మండల టాపర్‌గా నిలిచి బాసరలో సీటు సాధించిన గాదె శ్రీజను అభినందించి రూ.10 వేల నగదు బహుమతి ప్రకటించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, కరాటేలో డాక్టరేట్ సాధించిన క్రీడాకారులను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు.

తమ్మడపల్లి (జీ) గ్రామంలో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ్మడపల్లి (జీ), తీగారం గ్రామాలను అభివృద్ధి చెందిన గ్రామాల సరసన నిలపడం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. తమ్మడపల్లి (జీ) గ్రామానికి బీటీ రోడ్డు రావడం, పాఠశాల హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ కావడం, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం తన ఎమ్మెల్యే హయాంలోనే జరిగాయని తెలిపారు. 2004 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఏమి చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. తమ్మడపల్లి (జీ) గ్రామానికి అత్యధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.

తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండున్నర సంవత్సరాల కాలంలో ఒక్క తమ్మడపల్లి (జీ) గ్రామంలోనే రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, అలాగే 32 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించామని వెల్లడించారు. ఇప్పటికే రూ.20 లక్షల విలువైన సీసీ రోడ్లు మంజూరు చేశానని, నెల రోజుల్లో మరో రూ.30 లక్షల సీసీ రోడ్లు, మరో ఆరు నెలల్లో రూ.50 లక్షల విలువైన సీసీ రోడ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ నుంచి తమ్మడపల్లి మీదుగా జనగామ వరకు బస్సు సర్వీస్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.

తీగారం అభివృద్ధి కడియం శ్రీహరి హయాంలోనే జరిగింది..

తీగారం గ్రామానికి ఐదు వైపులా బీటీ రోడ్లు వేసింది కడియం శ్రీహరేనని, గ్రామంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనికీ తానే కారణమని పేర్కొన్నారు. తీగారం గ్రామంలో ఇప్పటివరకు రూ.1.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి రైతులకు సాగునీరు అందించామని, త్వరలోనే కాలువలకు సీసీ లైనింగ్ పూర్తి చేసి పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని వెల్లడించారు. కరువు పరిస్థితులు ఏర్పడినా నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా సాగునీరు అందించి రైతుల పంటలను కాపాడే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. తీగారం గ్రామంపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని, గ్రామంలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్, ఇతర రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కూడా తీగారం గ్రామానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కుండ నిండా అన్నం ఉన్నప్పుడే కడుపు నిండా పెట్టగలం, అందువల్ల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రాజకీయాలను పక్కనపెట్టి గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు స్వప్న బ్రహ్మారెడ్డి, సంధ్యారాణి రాజేష్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లావణ్య శిరీష్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కరుణాకర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Next Story