- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు!
సింగరేణిలో కొత్తగా 9 గనుల ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లు. రాబోయే 20 ఏళ్ల వరకు బొగ్గు ఉత్పత్తికి ధోకా లేకుండా మరియు వేలాది మందికి ఉపాధి కల్పించేలా భారీ ప్రణాళిక.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి (Singareni) సంస్థను లాభాల బాటలో నడిపిస్తూనే, రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. బొగ్గు నిల్వలు నిండుకుని మూతపడుతున్న గనుల స్థానంలో, కొత్త గనులను అందుబాటులోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేక పర్యవేక్షణలో మొత్తం 9 కొత్త ప్రాజెక్టులను (9 new projects) ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం (Singareni Management) రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 3 గనులకు అనుమతులు రాగా. వీటిలో ఒడిశాలోని నైనీ బ్లాకును ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించారు.
ఇంధన భద్రత-ఉపాధి గ్యారంటీ
2027-28 నాటికి సింగరేణిలో 4 పాత గనులు మూతపడనున్నాయి. దీనివల్ల ఏటా 12.51 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. ఈ లోటును భర్తీ చేయడం తో పాటు, మరో 20 ఏళ్ల పాటు నిరంతరంగా ఉత్పత్తి కొనసాగించేలా ప్రభుత్వం వ్యూహరచన చేసింది. కొత్త ప్రాజెక్టుల ద్వారా పాత గనుల కార్మికులకు ఉపాధిని కొనసాగించడమే కాకుండా, కొత్తగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కొత్త గనులకు అవసరమైన కేంద్ర బొగ్గు, అటవీ, పర్యావరణ శాఖల అనుమతుల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నారు.
దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న ఓపెన్ కాస్ట్ గనులకు కొనసాగింపుగా కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కొత్తగూడెం ఏరియాలో బొగ్గు తవ్వకాలు పూర్తిచేసిన భూగర్భ గనుల నుంచి 190 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు గల వీకే కోల్ మైన్ ప్రధానమైనది. ఈ గనికి సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని అనుమతులు రాగా ఓవర్ బర్డెన్ తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఈ మైన్‌తో పాటు మిగిలిన గనుల నుంచి బొగ్గు నిల్వలను వెలికి తీయనున్నారు.
గనులు, వాటి నుంచి వెలికితీయదగిన బొగ్గు నిల్వలు..
గని పేరు ఏరియా అంచనా నిల్వలు(మె.ట)
రామగుండం ఓసీ-1(విస్తరణ) రామగుండం-3 181.60
వీకే కోల్ మైన్ కొత్తగూడెం 190.00
పీకే కోల్ మైన్(కొండాపూర్) మణుగూరు 62.00
మణుగూరు ఓసీ ఎక్స్‌టెన్షన్ మణుగూరు 40.45
గోలేటి ఓపెన్ కాస్ట్ బెల్లంపల్లి 38.98
ఆర్‌కేపీ ఓసీపీ ఫేజ్-2 మందమర్రి 34.42
ఎంవీకే ఓపెన్ కాస్ట్ శ్రీరాంపూర్ 30.34
జేకే ఓపెన్ కాస్ట్ ఇల్లందు 19.68
ఈ ఏడాది 3 గనుల్లో ఉత్పత్తి ప్రారంభించాలి : సింగరేణి సీఎండీ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణిలో కొత్త గనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు వీలుగా ఆయా శాఖ అధికారులతో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఈ ఏడాది 3 గనుల నుంచి ఉత్పత్తి సాధించాలని, దీని కోసం ఇంకా మిగిలి ఉన్న అనుమతులను వెంటనే పొందేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.






