ఫిఫా వరల్డ్ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. రిటైర్మెంట్ ప్రకటించిన నెయ్‌మార్

by Muthe.Rajitha |

బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఫిఫా వరల్డ్ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. రిటైర్మెంట్ ప్రకటించిన నెయ్‌మార్
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో నార్వే చేతిలో బ్రెజిల్ జట్టు 2-1 తేడాతో ఊహించని పరాజయం పాలైన తర్వాత, ఆ దేశ ఫుట్‌బాల్ సంచలనం నెయ్‌మార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో నెయ్‌మార్ ఆరంభం నుండి కాకుండా, 67వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి ప్రవేశించాడు. మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌లో బ్రెజిల్ జట్టుకు లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి జట్టుకు ఏకైక స్కోరును అందించినప్పటికీ, ఆయన బ్రెజిల్ ఓటమిని, టోర్నమెంట్ నుండి నిష్క్రమణను తప్పించలేకపోయాడు. న్యూజెర్సీలోని ఈస్ట్ రూథర్‌ఫోర్డ్‌లో ఉన్న మెట్‌లైఫ్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన వెంటనే 34 ఏళ్ల నేమార్ మైదానంలోనే తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు.

భావోద్వేగ ప్రకటన

ఈ ఓటమి అనంతరం ప్రముఖ అంతర్జాతీయ ఛానెల్ తో నెయ్‌మార్ మాట్లాడుతూ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు భావోద్వేగంగా ప్రకటించాడు. "నేను బ్రెజిల్ జట్టును గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నించాను, ఎంతో పోరాడాను. కానీ, నా అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రయాణం ఏ మెట్‌లైఫ్ స్టేడియంలోనైతే ప్రారంభమైందో, సరిగ్గా ఇక్కడే ముగిసింది. ఇక అంతా అయిపోయింది" అంటూ వ్యాఖ్యానించాడు. నేమార్ 2010లో అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున ఇదే మెట్‌లైఫ్ స్టేడియంలో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా.. సరిగ్గా 16 ఏళ్ల తర్వాత మళ్లీ అదే మైదానంలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి కెరీర్‌ను ముగించడం గమనార్హం. నెయ్‌మార్ బ్రెజిల్ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ (80 గోల్స్) చేసిన ఆల్-టైమ్ లీడింగ్ స్కోరర్‌గా సరికొత్త రికార్డుతో తన కెరీర్‌ను ముగించాడు. అంతేకాకుండా, దిగ్గజ ఆటగాడు కఫు తర్వాత బ్రెజిల్ జట్టు తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా ఆయన నిలిచాడు.

నిరాశలో అభిమానులు

అంతర్జాతీయ మ్యాచులతో పాటు తన సుదీర్ఘ ప్రొఫెషనల్ క్లబ్ కెరీర్‌లో నేమార్ శాంటోస్ ఎఫ్‌సి, ఎఫ్‌సి బార్సిలోనా, పారిస్ సెయింట్-జర్మైన్ (PSG), అల్ హిలాల్ వంటి ప్రపంచ ప్రసిద్ధ క్లబ్‌ల తరఫున ఆడి ఎన్నో ట్రోఫీలను సాధించాడు. ఆ తర్వాత 2025లో ఆయన తిరిగి తన చిన్ననాటి క్లబ్ అయిన శాంటోస్‌లోనే చేరి ప్రస్తుతం కొనసాగుతున్నాడు. కెనడా, మెక్సికో, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో నేమార్ రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Next Story