- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం : ప్రేమను నిరాకరించిందని టెకీని నరికి చంపిన ఆటో డ్రైవర్
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిని దూరం పెట్టినందుకు, కక్ష పెంచుకుని యువతిని కత్తితో నరికి చంపాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిని దూరం పెట్టినందుకు, కక్ష పెంచుకుని యువతిని కత్తితో దారుణంగా నరికి చంపాడు. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలో తాడేరు గ్రామానికి చెందిన కొత్తపల్లి అనంతవాణి హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సుమారు ఏడాది క్రితం తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె స్వగ్రామానికి వచ్చి, ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమెకు సమీప గ్రామమైన కొర్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్ తాడేపల్లి శ్యామ్‌బాబుతో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. అయితే, శ్యామ్‌బాబుకు గతంలోనే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారనే నిజం అనంతవాణికి ఆలస్యంగా తెలిసింది. తనను మోసం చేసినట్లు గ్రహించిన ఆమె, శ్యామ్‌బాబు ప్రేమను నిరాకరిస్తూ అతడిని పూర్తిగా దూరం పెట్టారు.
అనంతవాణి తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయిన శ్యామ్‌బాబు ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తెల్లవారుజామున కావడంతో ఏమీ ఎరగని అనంతవాణి తలుపు తీసిన వెంటనే, శ్యామ్‌బాబు తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి, నరికి పరారయ్యాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన అనంతవాణిని స్థానికులు, కుటుంబ సభ్యులు తక్షణమే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం అనంతవాణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దారుణానికి ఒడిగట్టి పరారీలో ఉన్న నిందితుడు ఆటో డ్రైవర్ శ్యామ్‌బాబు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు.






