- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచివాలయంలో వింత పరిస్థితి.. టాప్ ఫ్లోర్‌లో నిలిచిన ఫుడ్ సప్లై!
తెలంగాణ సచివాలయం 6వ అంతస్తులో భోజనాలు బంద్ అయ్యాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికారానికి కేంద్రమైన సచివాలయం, అందునా ఆరో అంతస్తు.. సాక్షాత్తూ సీఎం ఆఫీస్ ఉండే చోటా ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా అక్కడి ఉద్యోగులు, సిబ్బందికి సరఫరా చేసే భోజనాలకు బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయినట్టు తెలిసింది. ఎవరిని అడిగినా ప్రయోజనం లేకపోవడం, ఒకరిపైఒకరు నెపం నెట్టేసుకుంటూ తప్పించుకునే ఆరోపణలు చేస్తుండటంతో చేసేది ఏమీలేక కాంట్రాక్టర్ సెక్రెటేరియట్‌లోని ఆరో అంతస్తుకు భోజనం సప్లయ్‌ను నిలిపివేసి వేసినట్టు సమాచారం.
సీఎం, సీఎస్ అక్కడే విధులు..
సచివాలయంలోని ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి, సీఎస్ సహా సీఎంవో సీనియర్ ఐఏఎస్అధికారులు అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తుంటారు. వీరి షేషిల్లో పనిచేసే అధికారులు, కిందిస్థాయి సిబ్బంది ఉదయం నుంచి రాత్రివరకూ కొందరు ఏదో ఒక పని చేస్తూనే ఉండాల్సి వస్తుంది. ఏ సమయంలో ఏ రకమైన సమాచారం, లెక్కలు, లేఖలు రాయడం, ఇతర కీలకమైన సమాచారం కోసం వీరు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. దీంతో వీరి సౌకర్యార్థం ప్రతి రోజూ ఉదయం టీ, టిఫిన్స్, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం స్నాక్స్అందిస్తుంటారు. ఒక్కోసారి అవసరమైతే రాత్రి ఫుడ్ కూడా అందిస్తుంటారు. వీరిందరికీ అవసరమైన టిఫిన్స్, భోజనాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ సచివాలయం సమీపంలోనే వంటలు వండి సరఫరా చేస్తుంటారు. పూర్తిగా శాఖాహార భోజనాన్ని అందిస్తుంటారు.
రెండేండ్లుగా బకాయిలు..
కాంట్రాక్టురుకు గత రెండేండ్లుగా బిల్లులు చెల్లించలేదని సచివాలయ ఉద్యోగ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం ఆరో ఫ్లోర్‌లో వందల సంఖ్యలో ఉండే చిన్న పెద్ద ఉద్యోగులు అందరూ కలిసి వందల సంఖ్యలో ఉంటారు. వారికి రెండేండ్లుగా భోజనాలు, టిఫిన్స్, స్నాక్స్ అందించడం వలన బిల్లులు రూ. కోట్లకు చేరుకున్నాయని సమాచారం. బిల్లులు చెల్లించాలని సదరు కాంట్రాక్టర్ ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైందని విశ్వసనీయవర్గాల సమాచారం. తాను వంట సరుకులు తెచ్చుకోవాలి, విడతల వారీగా అయినా కొద్ది మొత్తంలో బిల్లులు విడుదల చేయాలని కాంట్రాక్టర్ మొరపెట్టుకున్నా ఫలితం లేదని తెలిసింది. అధికారులు ఒకరిపైఒకరు నెపం వేసుకుంటూ బిల్లులు విడుదల చేయలేదని సమాచారం. దీంతో విసుగు చెందిన సదరు కాంట్రాక్టరు చివరకు భోజనాల సరఫరాను నిలిపివేశారు. తానింకా జేబులో నుంచి డబ్బులు పెట్టుకోలేనని, ఇప్పటికే అప్పుల పాలు అయ్యాయని.. సరుకులు కొనడానికి, పనివాళ్లు, వంట వాళ్లకు వేతనాలు చెల్లించుకోవాలి కదా? అంటూ ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. తనకు ఇంకా ఓపిక లేదని చెబుతూ భోజనాల సరఫరా బంద్‌చేసినట్టు తెలిసింది. సీఎం, సీఎస్, సీఎంవో అధికారులు ఉండే ఆరో అంతస్తు పరిస్థితే ఇలాఉంటే మిగిలిన కార్యాలయాల్లో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అని సచివాలయ ఉద్యోగులు కారిడార్‌లో గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి బిల్లుల కోసం వచ్చే వారికి అదే పరిస్థితి సచివాలయంలో కూడా ఉందని తెలియాలి కదా? అంటూ ఎద్దేవా చేస్తున్నట్టు తెలిసింది.






