- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్రటేరియట్‌లో సివిల్ సర్వెంట్స్ వార్: ఐఏఎస్ Vs నాన్-ఐఏఎస్!
తెలంగాణ బ్యూరోక్రసీలో ఐఏఎస్, నాన్-ఐఏఎస్ అధికారుల మధ్య అతర్యుద్ధం కొనసాగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఐఏఎస్, నాన్ ఐఏఎస్ అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది. తమ కేడర్‌కు చెందిన ఆఫీసర్లు పనిచేయాల్సిన చోట నాన్ ఐఏఎస్‌లకు పోస్టింగ్ ఇవ్వడంపై ఐఏఎస్‌లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. తమలో ఉన్న అసంతృప్తిని బయటికు కనిపించకుండా జాగ్రత్త పడుతున్న వారు.. ఫైల్స్ క్లియరెన్స్ సమయంలో మాత్రం.. తమ అసలు స్వరూపాన్ని చూపెడుతున్నట్టు తెలుస్తున్నది. ఫైల్ మీద కొర్రీలు వేయడమో, పెండింగ్‌లో పెట్టడమో, లేకపోతే ఏదో ఒకసాకు చెప్పి.. వెనక్కి పంపడం పరిపాటిగా మారిందనే ప్రచారం జరుగుతున్నది. డైరెక్ట్, కన్ఫర్డ్ ఐఏఎస్‌ల మధ్య సైతం పంచాయితీ నడుస్తున్నట్టు తెలుస్తున్నది.
‘మేమే సుప్రీం’ అనే ఫీలింగ్
ఆల్ ఇండియా సర్వీసుల్లో ఐఏఎస్ కేడర్ అత్యున్నతమైనది. ఆ కేడర్‌లో ఉన్న ప్రతి అధికారి అడ్మినిస్ట్రేషన్‌లో దిట్ట అనే రూల్ ఏమీ లేదు. ఆ తర్వాతి స్థాయిలో ఉండే కేడర్ ఆఫీసర్లు సైతం ప్రజలకు మెరుగైన సేవలు అందించిన చరిత్ర ఉంది. కానీ, ఆ విషయాలను పట్టించుకోకుండా కొందరు ఐఏఎస్‌లు మాత్రం తమ కేడర్ అధికారులే సుప్రీం అనే తీరుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంకొందరు ఐఏఎస్‌లు అయితే మిగతా కేడర్ అధికారులను చులకనగా చూడటం, వారి పట్ల అవహేళనగా మాట్లాడుతున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. నాన్ ఐఏఎస్ అధికారులు పంపే ఫైల్స్ మీద కొర్రీలు వేయడమో, సమీక్ష సమావేశాల్లో అవమానపరిచే విధంగా కామెంట్స్ చేయడం జరుగుతున్నట్టు తెలిసింది. దీంతో ఇరువర్గాల మధ్య కోల్డ్ వార్ మొదలై.. ఆ ప్రభావం పరిపాలనపై పడిన సందర్భాలు ఉన్నట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
బాస్‌లుగా నియమిస్తే సతాయింపులు
సహజంగా ఉద్యోగులను బాస్‌లు సతాయిస్తుంటారు. కానీ, ఐఏఎస్‌లు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. నాన్ ఐఏఎస్ ఆఫీసర్లను బాస్‌లుగా నియమిస్తే ప్రతి విషయంలో సతాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమకే ఆదేశాలు జారీ చేస్తారా? తమనే ప్రశ్నిస్తారా? అనే ధోరణితో ఐఏఎస్‌లు ఉంటారనే ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో బాస్‌లుగా ఉన్న సదరు నాన్ ఐఏఎస్‌లు.. ఐఏఎస్ లపై తమ కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించలేక మౌనంగా భరిస్తున్నట్టు తెలిసింది.
రెగ్యూలర్, కన్ఫర్డ్ మధ్య మరో పంచాయితీ
ఐఏఎస్‌లను కేంద్ర ప్రభుత్వం రెండు పద్ధతుల్లో నియమిస్తుంటుంది. ఒకటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌లో మెరిట్ ద్వారా సర్వీసులోకి రావడం. రెండోది స్టేట్‌లోని గ్రూప్ వన్ కేడర్‌లో పనిచేస్తున్న అధికారులు పదోన్నతి ద్వారా ఐఏఎస్‌కు ఎంపిక చేయడం. అయితే, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ రెండు రకాల ఐఏఎస్‌ల మధ్య కూడా పంచాయితీ నడుస్తున్నది. పదోన్నతి ద్వారా ఐఏఎస్‌కు ఎంపికైన అధికారుల పట్ల రెగ్యూలర్ ఐఏఎస్‌లు కాస్త చులకనగా చూస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ రెగ్యూలర్ ఐఏఎస్‌లపై బాసులుగా స్టేట్ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లను నియమిస్తే.. ఇరువురి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయనే చర్చ జరుగుతున్నది.
సీఎంవో ప్రక్షాళనకు అదే కారణమా?
ఈ రెండున్నరేళ్లలో సీఎం ఆఫీసులో పనిచేస్తున్న ఐదుగురు సెక్రెటరీలు మారారు. మార్పులు చేయడం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఐఏఎస్, నాన్ ఐఏఎస్ మధ్య ఉన్న విభేదాలు ఒక కారణమైతే.. డైరెక్ట్, స్టేట్‌కేడర్ ఐఏఎస్‌ల మధ్య ఉన్న ‘ఈగోలు’ మరో కారణం అనే చర్చ సెక్రెటేరియట్ వర్గాల్లో ఉన్నది. సీఎంవోలో నాన్ ఐఏఎస్‌లు, స్టేట్ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లను నియమించడం వల్ల వారు ఇచ్చే ఆదేశాలను వివిధ శాఖల్లో పనిచేస్తున్న డైరెక్ట్ కేడర్‌కు చెందిన సెక్రెటరీలు సీరియస్‌గా తీసుకోకపోవడం, సమీక్షా సమావేశాలకు తూతూ మంత్రంగా వచ్చి వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
పోస్టింగ్‌లో ప్రభుత్వమే ఫైనల్..
వివిధ శాఖల సెక్రెటరీలు, హెచ్ఓడీల్లో ఐఏఎస్‌లకు మాత్రమే పోస్టింగ్ ఇవ్వాలనే రూల్ లేదు. ప్రభుత్వం తన వెసులుబాటు, అధికారులపై ఉన్న విశ్వసనీయత ఆధారంగా ఇతర కేడర్లకు చెందిన అధికారులను సైతం సెక్రెటరీలు, హెచ్ఓడీలుగా నియమించుకునే అధికారం ఉంది. కానీ, అలాంటి నియామకాలను ఐఏఎస్‌లు జీర్ణించుకోవడం లేదని తెలుస్తున్నది. దీంతో పలు సందర్భాల్లో ఐఏఎస్, నాన్ ఐఏఎస్‌ల మధ్య విభేదాలు తలెత్తి, ఆ ప్రభావం అడ్మినిస్ట్రేషన్‌పై పడుతున్నట్టు చర్చ జరుగుతున్నది. పోస్టింగ్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐఏఎస్‌లు వ్యతిరేకించడంపై ఇతర కేడర్లకు చెందిన అధికారులు తీవ్రంగా మండిపడుతున్నట్టు తెలిసింది. ప్రజలకు సేవ చేయడంలో తమ నిబద్ధతను చూపకుండా.. కేడర్ అనే ‘ఈగో’తో ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






