- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ స్కూళ్లలో 'ఫీజుల’ దోపిడీ.. అర్హత లేని టీచర్లతో యథేచ్ఛగా బోధన
నారాయణపేట జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి.

నారాయణపేట జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ విద్యా వ్యాపారం సాగిస్తున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు ఇవ్వాల్సిన 25శాతం ఉచిత సీట్ల నిబంధనను యాజమాన్యాలు పూర్తిగా నీరుగార్చాయి. అడ్మిషన్ ఫీజులతోపాటు పుస్తకాలు, యూనిఫారాలు, షూస్ పేరుతో తల్లిదండ్రుల నుంచి ఇష్టానుసారంగా భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. తక్కువ జీతాలకే టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన అర్హత, అనుభవం లేని యువతను ఉపాధ్యాయులుగా నియమించుకుంటున్నారు. ఇంగ్లీష్‌పై పట్టు లేని ఈ అధ్యాపకులు విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మార్కెట్ గైడ్స్ ఆధారంగా కాలం వెళ్లదీస్తున్నారు. పాఠశాలల్లో కనీస వసతులు, ఆటస్థలాలు, ఫైర్ సేఫ్టీ లేకున్నా మండల విద్యాధికారులు ఏ ఒక్క స్కూలును తనిఖీ చేయడం లేదు. సైన్స్ ఫేయిర్ వసూళ్ల వల్లే జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటూ ప్రైవేటు అక్రమాలను చూసీచూడనట్లు వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి: నారాయణపేట జిల్లాలో ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కి విద్యా వ్యాపారానికి తెరలేపారు. జూన్ మాసం వచ్చిందంటే చాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఈ స్కూళ్లు, తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్ల పేరుతో ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నాయి. విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25శాతం ఉచిత సీట్లు కేటాయించాల్సి ఉన్నప్పటికీ ఆ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. అసలే కరువు, వలసలతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ఈ ప్రాంత ప్రజలకు ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీ భారంగా మారింది.
గైడ్స్ ఆధారంగా బోధన...
కార్పొరేట్ స్థాయి హంగులతో ప్రచారం చేసుకుంటున్న యాజమాన్యాలు, అరకొర జీతాలకే పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన అర్హత లేని యువతను అధ్యాపకులుగా నియమించుకుంటున్నాయి. ఇంగ్లీష్ భాషపై పట్టు లేకపోవడంతో, విద్యార్థులు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఈ ఉపాధ్యాయులు బుక్ స్టాల్స్ నుంచి గైడ్స్ తెప్పించుకుని కాలం వెళ్లదీస్తున్నారు. పాఠశాలల్లో ఆటస్థలాలు, ఫైర్ సేఫ్టీ, వ్యాయామ, యోగా ఉపాధ్యాయులు లేకపోవడమే కాకుండా అర్హులైన అధ్యాపకుల జాబితాను కూడా నోటీస్ బోర్డులపై ప్రదర్శించడం లేదు.
విద్యాశాఖ నిర్లక్ష్యం..
జిల్లాలో 140కి పైగా ప్రైవేటు స్కూళ్లు ఉన్నప్పటికీ, విద్యా సంవత్సరం ప్రారంభమై 20రోజులు గడుస్తున్నా మండల విద్యాధికారులు ఒక్క పాఠశాలను కూడా తనిఖీ చేయలేదు. యాజమాన్యాలు తల్లిదండ్రులతో కమిటీ వేసి ప్రతి నెల సమావేశాలు నిర్వహించాలనే నిబంధనను పూర్తిగా గాలికొదిలేశారు. జిల్లా విద్యాశాఖ ఏటా నిర్వహించే సైన్స్ ఫేయిర్ కోసం ప్రైవేట్ పాఠశాలల నుంచి పెద్దఎత్తున వసూళ్లు చేస్తున్నందువల్లే అధికారులు ఈ అక్రమాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ప్రైవేట్ పాఠశాలల వార్షిక ఆదాయాన్ని బట్టి ఫీజులు, ఉపాధ్యాయుల జీతాలు నిర్ణయించాలి. ప్రతి పాఠశాలలో టీటీసీ, బీఈడీ పూర్తి చేసిన వారిని మాత్రమే అధ్యాపకులుగా నియమించుకోవాలి. ఇప్పటికే జిల్లాలోని మండల విద్యాధికారులు ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తే పాఠశాలల అనుమతిని కూడా రద్దు చేస్తాం. - గోవిందరాజులు, డీఈవో, నారాయణపేట.






