ఆర్డర్లు తారుమారు.. చివరికి బదిలీ ఖాయం! ‘దిశ’ కథనాలు, ప్రజా సంఘాల ఎఫెక్ట్

by Ramesh Naini |

మక్తల్ ఐబీ ఈఈ కేతన్ కుమార్ బదిలీ వ్యవహారంలో ప్రమోషన్ ఆర్డర్ల మార్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆర్డర్లు తారుమారు.. చివరికి బదిలీ ఖాయం! ‘దిశ’ కథనాలు, ప్రజా సంఘాల ఎఫెక్ట్
X

మక్తల్ ఐబీ ఈఈ కేతన్ కుమార్ బదిలీ వ్యవహారంలో ప్రమోషన్ ఆర్డర్ల మార్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పనుల కోసం తనకు అనుకూలమైన అధికారిని ఉంచుకోవాలని ఒక బడా నాయకుడు చక్రం తిప్పినట్లు తెలిసింది. మట్టి మాఫియా, అక్రమార్కులతో చేతులు కలిపారనే ఆరోపణలు ఉన్న సదరు అధికారి కోసం బదిలీల ఆర్డర్లను తారుమారు చేయించారు. అయితే, మక్తల్ పరిధిలోని చెరువుల్లో నల్ల మట్టి అక్రమ తరలింపులపై ‘దిశ’ పత్రికలో వచ్చిన కథనాలు కలకలం రేపాయి. ఈ కథనాలతో గ్రామస్తులు, ప్రజా సంఘాలు నిరసన దీక్షలు చేపట్టడం, మంత్రి సైతం అసహనం వ్యక్తం చేయడంతో సమీకరణాలు మారాయి. తమ అవసరాలకు అధికారులను వాడుకుని, వివాదాలు ముదరగానే పక్కనబెడతారనే దానికి కేతన్ కుమార్ బదిలీయే నిదర్శనమని ఆఫీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

దిశ, మక్తల్ : మక్తల్ చిన్న నీటి పారుదల శాఖలో డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కేతన్ కుమార్‌కు, నాగర్ కర్నూల్‌లో ఉన్న గోపాలచారికి ఒకే జోన్ పరిధిలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా (ఈఈ) పదోన్నతులు లభించాయి. మొదట కేతన్ కుమార్‌ను నాగర్ కర్నూల్‌కు, గోపాలచారిని మక్తల్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అధికార పార్టీకి చెందిన ఒక ఉన్నతస్థాయి రాజకీయ నాయకుడు మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ప్రయోజనాల కోసం రాష్ట్ర నీటిపారుదల శాఖలో చక్రం తిప్పారు. తనకు అనుకూలంగా ఉంటూ, మట్టి మాఫియాతో సఖ్యతగా ఉండే కేతన్ కుమార్ ఇక్కడే ఉంటే బాగుంటుందని భావించిన సదరు నాయకుడు తన పలుకుబడితో ప్రమోషన్ జాయినింగ్ ఆర్డర్లను తారుమారు చేయించి మక్తల్ ఈఈగా కేతన్ కుమార్‌ను, నాగర్ కర్నూల్ ఈఈగా గోపాలచారిని మార్పించారు.

‘దిశ’ కథనాలతో వ్యతిరేకత..

ఇదిలా ఉండగా, ఇటీవల మక్తల్ నియోజకవర్గంలోని పలు చెరువుల్లో నల్ల మట్టి అక్రమ తరలింపులపై ‘దిశ’ పత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలకు గ్రామస్తుల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో పాటు, కేతన్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అక్రమాలను నిరసిస్తూ ప్రజా సంఘాలు ఏకంగా నిరసన దీక్షలు చేపట్టాయి. ఈ క్రమంలో స్థానిక మంత్రి మాటను కూడా కేతన్ కుమార్ వినకపోవడంతో ఆయనపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులు నాలుగు రోజుల క్రితమే కేతన్ కుమార్‌ను నాగర్ కర్నూల్‌కు, అక్కడ పనిచేస్తున్న గోపాలచారిని మక్తల్ ఈఈగా బదిలీ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు.

రాజకీయ అవసరాలకు బలి..

అధికార పార్టీ నాయకులు తమ సొంత అవసరాల కోసం అధికారులను వాడుకుని, ఆ తర్వాత అవసరం తీరాక వదిలించుకుంటారనే దానికి కేతన్ కుమార్ బదిలీ వ్యవహారమే నిదర్శనమని నీటిపారుదల శాఖ కార్యాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్లతో చేతులు కలిపి, వివాదాస్పద పనులకు వెనుకాడకుండా మట్టి మాఫియాకు, అక్రమార్కులకు సహాయం అందించారనే ఆరోపణలు కేతన్ కుమార్‌పై బలంగా ఉన్నాయి. ఇలాంటి వివాదాస్పద అధికారిని తమ ప్రాజెక్టు పనుల కోసం మక్తల్‌లోనే ఉంచుకోవాలని బడా నాయకుడు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

సరికొత్త మలుపు..

మొదట పొందిన ఆర్డర్లను మార్పించుకుని మక్తల్‌లోనే తిష్టవేసేందుకు ప్రయత్నించిన అధికారికి, ‘దిశ’ కథనాలు, ప్రజల నిరసనలు గట్టి షాక్ ఇచ్చాయి. ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడం, మంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు కేతన్ కుమార్‌ను నాగర్ కర్నూల్‌కు పంపక తప్పలేదు. రాజకీయ నాయకుల అండదండలతో అక్రమాలకు సహకరించినప్పటికీ, చివరకు ప్రజాగ్రహం ముందు అధికారుల పప్పులు ఉడకవని ఈ బదిలీల వ్యవహారం నిరూపించిందని స్థానికులు పేర్కొంటున్నారు.

Next Story