ఆ స్టార్ హీరో వల్ల నాకు గుర్తింపు వచ్చింది.. ఆయన దేశంలోనే అతిపెద్ద స్టార్‌గా ఎదగడం సంతోషంగా ఉంది: శ్రద్ధాదాస్

by Mallepaka Hamsa |

అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ఆమె చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

ఆ స్టార్ హీరో వల్ల నాకు గుర్తింపు వచ్చింది.. ఆయన దేశంలోనే అతిపెద్ద స్టార్‌గా ఎదగడం సంతోషంగా ఉంది: శ్రద్ధాదాస్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 2009లో వచ్చిన 'ఆర్య-2' సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్లు రాకపోవడంతో ఇక్కడ అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం హిందీలో వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా మారిన శ్రద్ధా దాస్, ఇటీవల 'త్రికాల' అనే మైథలాజికల్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. ఈ నేపథ్యంలో తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా దాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ఆమె చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

అల్లు అర్జున్ సినిమాలకు తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఏ రేంజ్‌లో ఆదరణ ఉంటుందో శ్రద్ధా దాస్ గుర్తుచేసుకున్నారు. బన్నీ నటించిన చిత్రాలకు తమిళం, మలయాళంలోకి డబ్ అయినప్పుడు కూడా అక్కడ థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతాయని ఆమె చెప్పారు. దక్షిణాదిలోనే కాకుండా, ఉత్తరాదిలో కూడా ఆయన డబ్బింగ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉందని తెలిపారు. అల్లు అర్జున్ చిత్రాల వల్లే తనకు నార్త్ ఇండియాలో కూడా మంచి గుర్తింపు లభించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తనతో కలిసి నటించిన అల్లు అర్జున్.. ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత బిగ్గెస్ట్ స్టార్ ఎదగడం తనకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని శ్రద్ధా దాస్ పేర్కొన్నారు. బన్నీ స్టార్‌డమ్‌పై శ్రద్ధా దాస్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story