Minister Lokesh: పెట్టుబడుల వేటలో లోకేశ్‌.. దక్షిణ కొరియా పర్యటన బిజీ.. బిజీ

by Ramesh Naini |   (  Updated:2026-07-06 05:03:37  IST  )

దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ రెండో రోజు పర్యటన అత్యంత బిజీగా సాగుతోంది.

Minister Lokesh: పెట్టుబడుల వేటలో లోకేశ్‌.. దక్షిణ కొరియా పర్యటన బిజీ.. బిజీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ రెండో రోజు పర్యటన అత్యంత బిజీగా సాగుతోంది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఆయన పలు కీలక భేటీలు నిర్వహించారు.

‘షూ’ కంపెనీతో భేటీ

సోమవారం ‘షూ ఆల్స్’ సంస్థ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్‌తో సమావేశమైన మంత్రి లోకేశ్.. ఏపీలో షూ ఆల్స్ ఆర్ అండ్‌ డీ, ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో కుదిరిన ఎంవోయూ ప్రకారం రాష్ట్రంలో పాదరక్షల యూనిట్ పనులను మరింత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

జీగాబ్ హా, సాఫ్ట్-ఈపీఐ సీఈవోతో భేటీ

తర్వాత షోలమ్ గ్రూప్ ఆఫీసర్ జీగాబ్ హా, సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్‌లతో ఆయన భేటీ అయ్యారు. శ్రీసిటీలో యూనిట్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రూ.338 కోట్లతో షోలమ్ సంస్థ ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్ నిర్మించాలని వెల్లడించారు. ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి ఐఐటీ సహకారంతో ఈపీఐ అకాడమీని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కొరియా ప్రతినిధులు తెలిపినట్లు సమాచారం.

భారత రాయబారితో భేటీ..

అంతకుముందు ఆదివారం సియోల్‌లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌ను లోకేశ్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా.. శాంసంగ్, ఎల్‌జీ, ఎస్‌కె వంటి కొరియన్ ఎలక్ట్రానిక్స్, చిప్స్ దిగ్గజాలను ఏపీకి రప్పించేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెట్టుబడి అనుకూలతలను రాయబారికి వివరించారు. ‘శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలో మౌలిక వసతులతో కూడిన క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయి. ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్ర యూనివర్సిటీల ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందిస్తున్నాం. దక్షిణ కొరియా చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి చేసిన ప్రతిపాదన మేరకు శ్రీసిటీలో ‘కొరియా ఎన్‌క్లేవ్‌’ కోసం ప్లగ్ అండ్ ప్లే విధానాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. అనంతపురంలో కియా/హ్యూండయ్ మొబిస్ ఆటో-ఈవీ క్లస్టర్ విస్తరణపైనా ఈ భేటీలో చర్చించారు. కాగా, ఆదివారం సియోల్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా (ప్రవాసాంధ్రుల) సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేశ్, అక్కడ ఉన్న తెలుగు వారితో ముచ్చటించి ప్రసంగించారు.

Next Story