- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం ఆలయ హుండీకి రికార్డు ఆదాయం.. నెల రోజుల్లోనే రూ. 7.19 కోట్లు!
శ్రీశైలం మల్లన్న హుండీకి నెల రోజుల్లో రూ. 7.19 కోట్ల రికార్డు ఆదాయం. 122 గ్రాముల బంగారం, 6 కేజీల వెండితో పాటు భారీగా అందిన విదేశీ కరెన్సీ.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి. గత నెల శివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తారు. అలాగే స్వామివారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు. గత 30 రోజులకు సంబంధించి ఆలయ ప్రాకారంలోని హుండీలను శనివారం అధికారులు పటిష్ట భద్రత మధ్య లెక్కించారు. ఈ లెక్కింపులో రికార్డు స్థాయిలో రూ. 7,19,40,642 (ఏడు కోట్ల పందొమ్మిది లక్షల నలభై వేల ఆరు వందల నలభై రెండు) నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. నగదుతో పాటు భక్తులు తమ మొక్కుల రూపంలో 122 గ్రాముల బంగారం, 6 కేజీల 550 గ్రాముల వెండిని స్వామివారికి కానుకలుగా సమర్పించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం ఈ స్థాయిలో నమోదైనట్లు తెలుస్తోంది.
నగదు, బంగారం తో పాటు ఈసారి మల్లన్న హుండీలో భారీగా విదేశీ కరెన్సీ కూడా లభించింది. వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు తమ భక్తిని చాటుకుంటూ విదేశీ నోట్లను హుండీలో వేశారు. ఇందులో ముఖ్యంగా 624 యూఎస్ డాలర్లు, 210 యూఏఈ దిర్హమ్స్, 70 యూరోలు, 60 కెనడా డాలర్లు, 25 ఆస్ట్రేలియా డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్లతో పాటు సింగపూర్, మలేషియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా దేశాలకు చెందిన కరెన్సీ కూడా లభించింది. ఆలయ ఈవో పర్యవేక్షణలో సిబ్బంది, శివసేవకులు కలిసి అత్యంత పారదర్శకంగా ఈ లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. శ్రీశైల క్షేత్రానికి అంతర్జాతీయ స్థాయిలో భక్తుల ఆదరణ పెరుగుతుందనడానికి ఈ విదేశీ కరెన్సీ రాకయే నిదర్శనమని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.






