నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు

by Jakkula.Mamatha |

నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం జులై 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య గురువారం తెలిపారు.

నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు
X

దిశ, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం జులై 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య గురువారం తెలిపారు. పాలిసెట్–2026లో అర్హత సాధించిన విద్యార్థులతో పాటు పదో తరగతి(ఎస్‌ఎస్‌సీ) ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా స్పాట్ అడ్మిషన్లకు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నుంచి రేపటి వరకు పైలాన్ కాలనీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు ఫారాలు కళాశాలలోనే అందుబాటులో ఉంటాయని వివరించారు.

జూలై 4(శనివారం) కళాశాల ప్రాంగణంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ఈ స్పాట్ అడ్మిషన్ల ద్వారా సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE), అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ (AMT) డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

విద్యార్థులు పాలీసెట్–2026 ర్యాంక్ కార్డు (వర్తించిన వారికి), ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టి.సి.), కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, ఇతర సంబంధిత ధ్రువపత్రాలతో పాటు వాటి జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని ప్రిన్సిపల్ ఐలయ్య స్పష్టం చేశారు. డిప్లొమా విద్య ద్వారా ఉన్నత విద్యతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Next Story