మానవత్వం చాటుకున్న వార్డెన్ హేమ..6 కిలోమీటర్లు విద్యార్థినిని భుజాలపై మోస్తూ

by Malleboina Mahesh |

రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామం.. జ్వరంతో ఉన్న 7వ తరగతి విద్యార్థినిని భుజాలపై 6 కి.మీ మోసి ఆసుపత్రికి చేర్చిన వార్డెన్ హేమ!

మానవత్వం చాటుకున్న వార్డెన్ హేమ..6 కిలోమీటర్లు విద్యార్థినిని భుజాలపై మోస్తూ
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ హాస్టల్ వార్డెన్ చూపిన సమయస్ఫూర్తి, మానవత్వం ఒక బాలిక ప్రాణాన్ని కాపాడింది. జిల్లా పరిధిలోని ఓ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థిని భువనేశ్వరి గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో (ఫీవర్) బాధపడుతోంది. ప్రస్తుతం మన్యం ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు, మలేరియా జ్వరాలు ప్రబలుతుండటంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. బాలికను తక్షణమే ఆసుపత్రికి తరలించాల్సి ఉండగా.. ఆ గ్రామానికి కనీస రవాణా సౌకర్యం (రోడ్డు మార్గం) లేదు.

కనీసం అంబులెన్స్, బైక్ కూడా వెళ్లలేని ఘాట్ రోడ్డు, రాళ్ల దారే శరణ్యం కావడంతో నిస్సహాయ స్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హాస్టల్ వార్డెన్ హేమ తన మానవత్వాన్ని చాటుకున్నారు. బాలికను తన భుజాలపై ఎక్కించుకుని.. కొండలు, గుట్టల మధ్య ఉన్న కఠినమైన రాళ్ల దారిలో ఏకంగా 6 కిలోమీటర్ల మేర భుజాలపై మోసుకుంటూ కాలినడకన ప్రధాన రహదారికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి వాహనంలో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్య సేవలు అందేలా చూశారు. ప్రస్తుతానికి విద్యార్థిని క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒక దైవదూతలా మారి విద్యార్థిని ప్రాణాలు కాపాడిన వార్డెన్ హేమపై గిరిజనులు, ఉన్నతాధికారులు, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story