- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొల్లిగూడంలో భూపోరాటం ఉద్రిక్తం..
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బొల్లిగూడంలో గురువారం తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూపోరాటం ఉద్రిక్తతకు దారితీసింది.

దిశ, మేడిపల్లి : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బొల్లిగూడంలో గురువారం తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూపోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. ఉప్పల్ బాగాయత్‌లో నిర్వహించాలనుకున్న భూపోరాట సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు పలువురు నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో సభా వేదికను బొల్లిగూడానికి మార్చగా, అక్కడ కూడా సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. భూపోరాట సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లను అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు తొలగించారు. దీనిని వ్యతిరేకిస్తూ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భూపోరాటంలో పాల్గొనేందుకు బొల్లిగూడానికి వచ్చిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కవిత అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉండగా, బొల్లిగూడం ప్రాంతంలోని దళితుల భూములను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానంలో స్వాధీనం చేసుకుని ఎకరానికి 600 గజాల చొప్పున ప్లాట్లు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోందని స్థానిక దళితులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూపోరాటాన్ని కొందరు స్థానికులు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. భూపోరాటం సందర్భంగా అదుపులోకి తీసుకున్న తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలను ఘట్‌కేసర్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. దీనికి నిరసనగా కార్యకర్తలు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టి, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బొల్లిగూడం ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.






