సిమ్ స్వాప్ సైబర్ ఫ్రాడ్

by Muthe.Rajitha |

సిమ్ స్వాప్ సైబర్ ఫ్రాడ్ మీద డా.కట్కూరి ప్రత్యేక విశ్లేషణ

సిమ్ స్వాప్ సైబర్ ఫ్రాడ్
X

నేటి డిజిటల్ ఆర్థిక ప్రపంచంలో నగదు, బ్యాంకు బ్యాలెన్స్ కాపాడుకోవడానికి సిమ్ ఆధారిత ఓటీపీలు అత్యంత కీలకమైన భద్రతా వలయాన్ని అందిస్తున్నాయి. టూ ఫ్యాక్టర్ ధృవీకరణలో భాగంగా ఒక నిర్దిష్ట లావాదేవీని ధృవీకరించడానికి మీ మొబైల్‌కు వచ్చే ఈ ఓటీపీలు మీ బ్యాంకు ఖాతాకు, క్రెడిట్ కార్డులకు అంతిమ రక్షణగా పనిచేస్తాయి. ఈ కీలకమైన రక్షణ వలయాన్ని ఛేదించడానికి సైబర్ నేరగాళ్లు ప్రయోగిస్తున్న అత్యంత ప్రమాదకరమైన వ్యూహం సిమ్ స్వాప్ ఫ్రాడ్. 2024లో అనాధికారిక సిమ్ స్వాప్ కేసులలో 1055% భారీ పెరుగుదల నమోదైంది. 2023లో 300 లోపు ఉన్న సిమ్ స్వాప్ కేసులు, 2024 నాటికి 3,000కు పైగా పెరిగాయి.

సమాచార సేకరణ వ్యూహం

సిమ్ స్వాప్ ఫ్రాడ్ సోషల్ ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించి నేరగాళ్లు ఫిషింగ్ ఈమెయిల్‌లు, విషింగ్ కాల్స్, పాత డేటా బ్రీచ్‌ల ద్వారా మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఆధార్, పాన్ వివరాలు, బ్యాంక్ ఖాతా సంఖ్యలు, చివరకు మీ సిమ్ కార్డు వినియోగ వివరాలు వంటి కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. ఉదాహరణకు వారు బ్యాంకు ప్రతినిధులుగా నటిస్తూ మీ కేవైసీ అప్‌డేట్ చేయాలని అడుగుతారు. తద్వారా మీరు సున్నితమైన వివరాలను స్వయంగా వారికి పంపుతారు. ఈ వివరాలు వారికి టెలికాం ఆపరేటర్‌ను నమ్మించడానికి, మీ గుర్తింపును దొంగిలించడానికి కీలకమైన సాధనాలుగా మారతాయి. ఈ దశలో నేరగాళ్లు మీ ఆర్థిక ప్రొఫైల్‌ను పూర్తిగా సిద్ధం చేస్తారు. నేరగాళ్లు సోషల్ మీడియాలో మీరు పంచుకునే సమాచారాన్ని కూడా నిశితంగా గమనిస్తారు. పుట్టినరోజులు, ప్రదేశాలు, ఇతర వ్యక్తిగత ఆసక్తులు వారి దాడులకు అనుకూలంగా మారతాయి.

నకిలీ ధృవీకరణతో సిమ్ కార్డు స్వాధీనం

సేకరించిన వివరాలతో నేరగాళ్లు టెలికాం ఆపరేటర్ కస్టమర్ కేర్‌ను లేదా బ్రాంచ్‌ను సంప్రదిస్తారు. వారు పాత సిమ్ పాడైపోయిందని లేదా ఫోన్ పోయిందని చెప్పి మీ నంబర్‌ను తో కొత్త సిమ్ కార్డుకు ఇవ్వమని అభ్యర్థిస్తారు. ఈ అభ్యర్థన విజయవంతం అయిన తక్షణమే టెలికాం సంస్థలు మీ పాత సిమ్‌ను సాంకేతికపరంగా డియాక్టివేట్ చేస్తాయి. ఫలితంగా మీ మొబైల్ ఫోన్‌లో నెట్‌వర్క్ పూర్తిగా నిష్క్రియం అవుతుంది. ఈ సిమ్ స్వాప్ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని టెలికాం సంస్థలు కొంత సమయం తీసుకుంటాయి. నేరగాళ్లు ఈ కాలాన్ని కూడా అత్యంత చాకచక్యంగా ఉపయోగించుకుంటారు. మీ ఫోన్ సిగ్నల్ పోగానే మీరు సాంకేతిక సమస్య అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. మీ మొబైల్ ఆపరేటర్ నుండి మీకు వచ్చే హెచ్చరిక సందేశాలను మీరు గమనించకపోవచ్చు. ఎందుకంటే అప్పటికే మీ ఫోన్ సిగ్నల్ వ్యవస్థ పనిచేయడం ఆగిపోతుంది. నేరగాళ్ల దగ్గర ఉన్న కొత్త సిమ్ కార్డు ఇప్పుడు మీ ఫోన్ నంబర్‌తో క్రియాశీలం అవుతుంది. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో ఆ ఫోన్ నంబర్‌కు యజమాని నేరగాళ్లే. ఈ దశ మీ ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రారంభం అవుతుంది.

ఆర్థిక దోపిడీ

నేరగాళ్లు తుది దశ ఆర్థిక దోపిడీకి సిద్ధమవుతారు. మీ సిమ్ నిష్క్రియమైన తక్షణమే మీ మొత్తం డిజిటల్ ఆర్థిక ప్రపంచం నియంత్రణ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. మీ బ్యాంక్, వాలెట్, క్రెడిట్ కార్డు లావాదేవీలకు సంబంధించిన అన్ని కీలకమైన ఓటీపీలు నేరుగా వారి కొత్త సిమ్ కార్డుకే చేరతాయి. వారు మొదట మీ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫర్గాట్ పాస్‌వర్డ్ ఎంపికను ఎంచుకుంటారు. దానికి వచ్చే ఓటీపీని ఉపయోగించి మీ ఖాతా పాస్‌వర్డ్‌ను మారుస్తారు. పాస్‌వర్డ్ మార్చిన తర్వాత వారు పెద్ద మొత్తంలో డబ్బును వేరే ఖాతాలకు బదిలీ చేస్తారు. ఆన్‌లైన్ షాపింగ్‌కు ఈ ఓటీపీలను వాడుకుంటారు. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. మీరు అప్రమత్తమయ్యే లోపలే నష్టం జరిగిపోతుంది. ఇది మీ ఆర్థిక పునాదులను దెబ్బతీస్తుంది. మీ ఖాతాలోని ప్రతి రూపాయి వారి లక్ష్యం అవుతుంది. ఆన్‌లైన్ లావాదేవీల పరిమితిని పెంచి వీలైనంత ఎక్కువ మొత్తాన్ని తరలిస్తారు.

నష్ట తీవ్రత

నేరగాళ్లు ఓటీపీని ఉపయోగించి ఐఎంపీఎస్, నెఫ్ట్, యూపీఐ ద్వారా మీ పొదుపు ఖాతాలో ఉన్న మొత్తాన్ని క్షణాల్లో వేరే ఖాతాలకు బదిలీ చేస్తారు. ఐఎంపీఎస్, యూపీఐ లావాదేవీలు తక్షణమే పూర్తవుతాయి. కాబట్టి ఈ లావాదేవీలు ఒక్కసారి పూర్తయితే వాటిని బ్యాంకు ద్వారా తిరిగి పొందడం చాలా కష్టం అవుతుంది. మీరు బ్యాంకును సంప్రదించినా డబ్బు అప్పటికే దొంగల ఖాతాలకు చేరిపోతుంది. క్రెడిట్ కార్డు వివరాలను వారు సులభంగా పొందుతారు. పెద్ద మొత్తంలో డబ్బు అడ్వాన్స్‌గా తీసుకుంటారు. నేరగాళ్లు మీ క్రెడిట్ పరిమితిని పూర్తిగా ఉపయోగిస్తారు. తద్వారా మీరు భారీ అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. ఈ అప్పులను తిరిగి చెల్లించే బాధ్యత మీపై పడుతుంది.

అధునాతన ధృవీకరణ భద్రత

బ్యాంకింగ్ లావాదేవీలకు మల్టి ఫ్యాక్టర్ అథెంటికేషన్ పద్ధతులను ఉపయోగించండి. ఈ పద్ధతులు సిమ్ స్వాప్ ద్వారా ఓటీపీ దొంగిలించబడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. మీరు ఓటీపీని ఎంటర్ చేసే ముందు ఆ మెసేజ్‌లో ఆ ఓటీపీ ఏ లావాదేవీ కోసం వచ్చిందో సరిగ్గా చదవండి. మీరు చేయని లావాదేవీకి ఓటీపీ వస్తే దాన్ని ఎంటర్ చేయవద్దు. ఉచిత వైఫై నెట్‌వర్క్ లలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ వాడటం ప్రమాదకరమని గుర్తుంచుకోండి. మీరు మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లలో తక్షణమే లావాదేవీ జరిగే పరిమితులను తక్కువగా సెట్ చేయండి. తద్వారా నేరగాళ్లు ఒకేసారి భారీ మొత్తంలో డబ్బు దొంగిలించడాన్ని మీరు కష్టం చేస్తారు. ఒకవేళ సిమ్ స్వాప్ ఫ్రాడ్‌కు గురైతే మీరు వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. మీ అవగాహన మీ డబ్బును రక్షిస్తుంది.

డా.కట్కూరి

సైబర్ సెక్యురిటీ & న్యాయ నిపుణుడు.

[email protected]

Next Story