- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊరి బడులకు ఉరి వేస్తారా?
తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు ఊపిరి పోసే ఒక జీవన కేంద్రంగా నిలబడ్డ ప్రభుత్వ బడులను మూసివేస్తానని CM ప్రకటించడం అత్యంత ఆందోళనకరణమైన విషయం.

ఊర్లో బడులే లేకపోతే ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదే కాదు.. సుమారు 1500 మంది విద్యార్థి అమరుల త్యాగం వల్ల ఏర్పడ్డ తెలంగాణ బడులు రాష్ట్రంలో.. ఊరుబడుల్లో వికసించిన విద్యా పుష్పాలు యూనివర్సిటీల ముందు లాటీలు తూటాలు తుపాకీ గోళ్ళకు బలయితేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనేది వాస్తవం. ఇలాంటి తెలంగాణలో సకల జనులకు విద్య వైద్యం ఉచితంగా అందుతుందని అనేక వేదికల మీద పూర్వరా మాట్లాడిన సందర్భం. 12 ఏళ్లతో అనంతరం ఇవాళ తెలంగాణ ఊర్లలో ఉన్న బడులన్నిటినీ మూసేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి బెంగళూరులో జాతీయ పత్రిక సమావేశంలో మాట్లాడటం తెలంగాణ ఆకాంక్షను కాలరాయడం లాంటిది.
జీవన కేంద్రాలను మూసివేస్తే
విద్యాహక్కు చట్టం 2009 లో, సెక్షన్ 51 (ఏ) (బి) ప్రకారం ఐదో తరగతి లోపు చదివే విద్యార్థులకు ఒక కిలోమీటర్ దూరంలో ఆ పై తరగతులు చదివే విద్యార్థులకు మూడు కిలోమీటర్ల లోపల పాఠశాల విద్యను అందించాలని చట్టం చెబుతుంది. దీనికి విరుద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు ఊపిరి పోసే ఒక జీవన కేంద్రంగా నిలబడ్డ ప్రభుత్వ బడులను మూసివేస్తానని ప్రకటించడం అత్యంత ఆందోళన కారణమైన విషయం. గత ప్రభుత్వం మూసివేసిన 6000 పాఠశాలలను తెరిపిస్తామని విద్యారంగంలో 15% బడ్జెట్‌ని కేటాయిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయి. ప్రస్తుతం పెర్ఫార్మన్స్ ఇండెక్స్ లో తెలంగాణ 26 నుండి 28వ స్థానానికి దిగజారింది.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక్క దానికి 200 కోట్లు
తెలంగాణ ఆవిర్భావానంతరం మొదటి దశాబ్ద కాలంలో 37000 ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 29 వేలకు తగ్గితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరో రెండు వేలు మూతపడి 27 వేలకు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ పాఠశాల స్థితిగతులను బాగుపరచవలసిన ప్రభుత్వం వాటిని బొంద పెట్టి నాలుగు వేల పాఠశాలలను మాత్రమే కొనసాగిస్తామని ప్రకటించడం తెలంగాణ విద్యా రంగానికి బలిపీఠంలా మారింది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక్క దానికి 200 కోట్లు కేటాయిస్తూ మెగా బడుల్ని తెరుస్తామని చెబుతూ, వాటికి బదులుగా 23 వేల ఊరుబడులకు ఉరిపెట్టడం దారుణం.
భవిష్యత్ తరాలకు బలిపీఠం
ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని ఉన్న బడులను బాగు చేసి, 200 కోట్లను ఒక్కో మండలానికి కేటాయిస్తే ఉన్న బడులన్నీ ఉన్నతీకరించబడతాయి. ఊరికి చేరువలో ఉన్న బడులను ఏకం చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యను పెంచి ఉన్నత ఫలితాలను రాబట్టవచ్చు. కానీ అందుకు భిన్నంగా మొత్తంగా తెలంగాణ విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ఈ పరిస్థితి రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు బలిపీఠంగా మార నున్నది. వేలాది ఊరి బడులను ఉన్నఫళాన మూసివేయాలని చూస్తున్న ప్రభుత్వం అంతకు ముందు ఊర్లలో, పట్టణాల్లో పేరుకుపోయిన మద్యం గదులను మూసివేయాలి.
విద్య, వైద్యం ఉచితంగా అందేవరకు పోరాటం
ఇప్పటికే చాలా గ్రామాల్లో గ్రామ సర్పంచులు మా ఊర్లోకి ప్రైవేటు బస్సులు రావద్దని మా ఊరు బడిని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. అట్లా మూత పడనున్న 9000 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు గ్రామ కమిటీ తీర్మానాలుగా మా బడులు మూసేయొద్దు అని ప్రభుత్వానికి తెలియజేయాలి. పాఠశాల పూర్వ విద్యార్థులు, విద్యావంతులు గ్రామ పెద్దలు తమ ఊరి బడిని కోల్పోవడం అంటే తన సాంస్కృతిక వికాస కేంద్రాన్ని పాతర వేయడం లాంటిదే కనుక, ఆయా గ్రామాల పాఠశాలను కాపాడుకోవడం బలోపేతం చేయడానికి ఒక ఉద్యమంగా సాగాల్సిన సందర్భం. ఎందుకోసం విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలపడం ద్వారా తెలంగాణలో విద్య వైద్యం ఉచితంగా అందే వరకు పోరాడాలి.
ప్రభాకర్ కస్తూరి
94409 79454






