వాన దేవుడి కోసం ప్రత్యేక పూజలు.. గద్వాలలో మహిళల భిక్షాటన

by Jakkula.Mamatha |

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గద్వాల మండలం చేనుగొనిపల్లి గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో వాన దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

వాన దేవుడి కోసం ప్రత్యేక పూజలు.. గద్వాలలో మహిళల భిక్షాటన
X

దిశ,జోగులాంబ ప్రతినిధి: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గద్వాల మండలం చేనుగొనిపల్లి గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో వాన దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామ మహిళలు కర్రతో చేసిన బొమ్మ, యాపాకు, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించిన బుట్టను తీసుకుని గద్వాల పట్టణంలోని ప్రతి అంగడికి వెళ్లి వాన పాటలు పాడుతూ భిక్షాటన చేపడుతున్నారు. ప్రజలు ఇచ్చే బియ్యం, ధాన్యం, నగదును సేకరించి వాటితో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

గ్రామ పెద్దల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ వారం రోజుల పాటు ఈ పూజలు నిర్వహిస్తామని మహిళలు తెలిపారు. అనంతరం ఇంటి కప్పు పై ఉండే దోనిలో కప్పను కిందకు వదిలితే వానదేవుడు ప్రసన్నమై వర్షాలు కురిపిస్తాడని విశ్వాసంతో ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ రైతులు, గ్రామస్తులు మంచి వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేనుగొనిపల్లి మహిళలు నిర్వహిస్తున్న సంప్రదాయ పూజలు స్థానిక ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా కొనసాగుతున్న ఈ జానపద ఆచారం ప్రకృతి పట్ల ప్రజల విశ్వాసానికి, వ్యవసాయ సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తుంది.

Next Story