ఆర్మూర్‌లో ప్రైవేట్ పాఠశాల బస్సుల పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి

by Batti.Sumithra |

ఆర్మూర్ పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలు తమ స్కూల్ బస్సుల్లో అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్నాయని, దీంతో విద్యార్థుల భద్రతకు ప్రమాదం నెలకొని ఉందని బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు షాహిద్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్మూర్‌లో ప్రైవేట్ పాఠశాల బస్సుల పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలు తమ స్కూల్ బస్సుల్లో అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్నాయని, దీంతో విద్యార్థుల భద్రతకు ప్రమాదం నెలకొని ఉందని బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు షాహిద్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో సోమవారం ఆర్మూర్ మోటార్ వాహన తనిఖీ అధికారి రాహుల్ కుమార్ కు బీఆర్ఎస్వీ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా షాహిద్ అలీ పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు బస్సుల్లో నిల్చొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొనడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

అదేవిధంగా కొంతమంది స్కూల్ బస్సు డ్రైవర్లు అధిక వేగంతో వాహనాలు నడుపుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రైవేట్ పాఠశాల బస్సులు నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా అనే అంశం పై ఆర్మూర్ ప్రాంతీయ రవాణా అధికారి (RTO) ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని బస్సులు, సాంకేతిక లోపాలు ఉన్న వాహనాలు రోడ్ల పై తిరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలు, వాహన యజమానుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రాంతీయ రవాణా అధికారి (RTO) రాహుల్ కుమార్ స్పందించారు. పాఠశాల యాజమాన్యాలకు పరిమితికి మించి విద్యార్థులను బస్సుల్లో తరలించవద్దని సూచనలు జారీ చేస్తామని, అవసరమైన తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌వీ తరఫున షాహిద్ అలీ కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు రవికిరణ్, దీపక్, ఇర్షాద్ రిజ్వాన్, జుబేర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story