- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
ప్రజలు తమ సమస్యలను అధికారుల వద్దకు తీసుకొస్తే అవి తప్పకుండా పరిష్కారమవుతాయనే నమ్మకాన్ని కల్పించేలా ప్రతి శాఖ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

దిశ, జనగామ : ప్రజలు తమ సమస్యలను అధికారుల వద్దకు తీసుకొస్తే అవి తప్పకుండా పరిష్కారమవుతాయనే నమ్మకాన్ని కల్పించేలా ప్రతి శాఖ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్‌తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, సంబంధిత శాఖ అధికారులకు దరఖాస్తులను అందజేసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 335 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖలకు పంపించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణిలో వచ్చిన ప్రధాన వినతులు..
బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామానికి చెందిన ఇమ్మడి రేఖ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు, చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన యాకుబి తన వికలాంగ కుమారుడికి వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరారు, లింగాల ఘనపురం మండలం వేలేరు గ్రామానికి చెందిన పల్లా వెంకటలక్ష్మి, తన తల్లిదండ్రులు పసుపు-కుంకుమ కింద ఇచ్చిన భూమిని తన అనుమతి లేకుండా అన్నదమ్ములు తమ పేర్లపై పట్టా చేసుకున్నారని, ఆ భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేయాలని వినతిపత్రం సమర్పించారు, కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన సంధ్య తన కుమార్తెకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కల్పించాలని కోరారు, కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన కె. సుమతిదేవి తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు.
ప్రతి దరఖాస్తును సానుకూలంగా పరిశీలించి అర్హుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.






