దానం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ షురూ.. హాజరైన కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాదులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-30 06:02:14  IST  )

రాష్ట్రంలో రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశం కీలక దశకు చేరుకుంది.

దానం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ షురూ.. హాజరైన కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాదులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశం కీలక దశకు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన రెండు అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో అధికారికంగా విచారణ ప్రారంభించారు. బీఆర్ఎస్ తరఫున పిటిషన్ వేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాదులు స్పీకర్ ఎదుట హాజరై తమ వాదనలు విపించనున్నారు. మరోవైపు దానం నాగేందర్ తన న్యాయవాదులతో విచారణకు హాజరయ్యారు. అయితే, విచారణకు ముందే దానం స్పీకర్‌కు ఓ అఫిడవిట్ సమర్పించారు. అందులో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నానని పేర్కొన్నారు. 2024 మార్చిలో తాను కాంగ్రెస్ సమావేశానికి హాజరైంది కేవలం వ్యక్తిగత హోదాలోనే తప్ప పార్టీ మారినట్లుగా కాదని తెలిపారు. ఇదే కేసులో బీజేపీ శాసనసభా పక్ష నేతల ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్ ప్రసాద్ కుమార్ మధ్యాహ్నం 12 గంటలకు విచారణను ప్రారంభించనున్నారు.

కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విధించిన గడువు ఈనెల 31తో ముగియనుండటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. గతంలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న మెజారిటీ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story