శబ్దాన్ని ఎవరూ బంధించలేరు

by Muthe.Rajitha |

ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన కలాన్ని గళాన్ని అంకితం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై జరిగిన కాల్పుల ఘటనకు నేటికి 29 సంవత్సరాలు పూర్తయ్యాయి.

శబ్దాన్ని ఎవరూ బంధించలేరు
X

ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన కలాన్ని గళాన్ని అంకితం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై జరిగిన కాల్పుల ఘటనకు నేటికి 29 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే ఆ దాడికి పాల్పడిన వారు ఇప్పటికీ చట్టం ముందుకు రాకపోవడం దేశంలోని విచారణ వ్యవస్థల వైఫల్యాన్ని గుర్తు చేసే బాధాకరమైన వాస్తవంగా మిగిలింది...

1997 ఏప్రిల్ 6న సాయంత్రం కొందరు వ్యక్తులు వరంగల్ నుంచి వచ్చామని చెప్పి గద్దర్‌ని కలవడానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. మాట్లాడుతున్న సమయంలోనే అకస్మాత్తుగా ఆయన్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన రక్తపు మడుగులో పడిపోయారు. చనిపోయాడని భావించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ప్రజల ప్రేమాభిమానం ఆయనను తిరిగి నిలబెట్టింది. మరణాన్ని జయించి మళ్లీ ప్రజల మధ్య నిలిచిన గద్దర్ కలం.. గళం మరింత బలంగా మారింది. ఆ రోజుని గద్దర్ తన పునర్‌జన్మ రోజుగా జరుపుకునేవారు.

((ఇలా పాలకుల తూటాలకు, దౌర్జన్యాలకు గురైన ప్రజాగాయకులు, ఎందరో దేశ దేశాన ఉన్నారు. ఏలికలు ఎక్కడి వారైనా ప్రజాపాటను అంతం చేయాలనే చూశారు. ప్రపంచ ప్రసిద్ధ రచయితలు, కవులు, కళాకారులు ఎందరో పాలకులను ప్రశ్నించినందుకు నిర్బంధాలకు గురయ్యారు. వారిలో షేక్స్ పియర్, మిల్టన్, షెల్లీ, గోల్డ్‌స్మిత్, మపాసా, బాల్జాక్, గిబ్సన్, రూసో, టాంపెయిన్, గోథే, జాక్‌లండన్, మర్క్ ట్వైన్, థామస్ హర్డీ, ఆస్కార్ వైల్డ్, టాల్‌స్టాయ్, డీహెచ్ లారెన్స్, ఎమిలీ జోలా, హెమింగ్‌వే, మాక్సిం గోర్కీ ఇలా పాలకుల కన్నెర్రకు గురైన రచయితలు, కళాకారులు, గాయకులు ఎందరో. వారంతా ఆత్మగౌరవ పోరాటాల పతాకలు. మానవీయ సమాజాన్ని కల గన్న వీరులు.))

సమాజం నేడు ఒక విచిత్రమైన విరుద్ధతను చూస్తోంది. ఒకవైపు సాంకేతిక అభివృద్ధి, సంపద, మార్కెట్లు విస్తరిస్తున్నాయి. మరోవైపు కోట్లాది ప్రజలు ఆకలి, నిరుద్యోగం, అన్యాయం, అణచివేతలతో పోరాడుతున్నారు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, కష్టజీవుల జీవితాలు మరింత సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి. చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే అణచివేత ఉన్న చోట ప్రతిఘటన పుడుతుంది. అన్యాయం ఉన్న చోట ప్రజల స్వరం వినిపిస్తుంది.

పోరాటబాటలోనే సకల వర్గాలూ..

ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, రైతులు, ఆదివాసీలు, మహిళలు, విద్యార్తులు ఉద్యోగస్తులు, తమ హక్కుల కోసం గళం విప్పుతున్నారు. వారి పోరాటం కేవలం అన్నం కోసం కాదు; అది గౌరవం కోసం. జీవన హక్కు కోసం. స్వాభిమానంతో బతికే హక్కు కోసం జరుగుతున్న పోరాటం. ఈ ప్రజానుకూల స్వరాలను అణగదొక్కడానికి కొత్త కొత్త శక్తులు ముందుకు వస్తున్నాయి. కార్పొరేట్ లాభాల కోసం భూములను దోచుకోవడం, ప్రకృతి సంపదలను కబ్జా చేయడం, కూలీల కష్టాన్ని దోపిడీ చేయడం జరుగుతున్నాయి. ఈ అన్యాయాలను ప్రశ్నించే ప్రజా ఉద్యమాలను మౌనం చేయడానికి బెదిరింపులు, దాడులు జరుగుతునే ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజల హక్కుల కోసం మాట్లాడే కవులు, కళాకారులు, ఆదివాసీలు, దళితులు, బహుజనులు మహిళలు, రైతులు విద్యార్ధులు, ఉద్యోగస్తులు సామాజిక కార్యకర్తలు హింసకు గురవుతున్నారు.

ప్రజల పాటను బుల్లెట్లతో చంపలేరు

చరిత్రలో ఎన్నో సార్లు నిరూపితమైన ఒక నిజం ఉంది. ప్రజల స్వరాన్ని తుపాకీతో ఆపలేరు. ప్రజల పాటను బుల్లెట్లతో చంపలేరు. ఈ సత్యాన్ని తన జీవితంతో చూపించిన ప్రజా యుద్ధనౌక గద్దర్. ఆయన పాటలు కేవలం సంగీతం కాదు. అవి పేదల గుండెల్లోంచి పుట్టిన నాదం. కూలీల చెమటలోని కథలు. రైతులు, ఆదివాసులు, మహిళలు, విద్యార్థి, ఉద్యోగస్తుల కన్నీళ్ల చరిత్ర. ప్రజా యుద్దనౌక గద్దర్ పాట వేదికపై మొదలవుతుంది.. కానీ అది అక్కడితో ఆగదు. ఆ పాట పొలాల్లోకి వెళ్తుంది. గనుల్లోకి వెళ్తుంది. బస్తీల్లోకి వెళ్తుంది. ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది!

మహా సాంస్కృతిక సేనాని

శబ్దాన్ని ఎవరూ బంధించలేరు. శబ్దాన్ని ఎవరూ ఉరి తీయలేరు. ఆ శబ్ద తరంగాలకు జీవం పోసిన మహా సాంస్కృతిక సేనాని, నాయకుడు ప్రజాయుద్ద నౌక గద్దర్ ఆరు దశాబ్దాల పాటు పేద ప్రజల ఆక్రోశాన్ని, వారి ఆవేదనను పాలకుల ఎదుట ఉంచుతూ, భావ ప్రకటనతో కూడిన శబ్ద తరంగాలను సృష్టించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. అందుకే ప్రజా సంస్కృతి ఒక ఉద్యమంగా మారుతుంది. పాట ఒక ఆయుధంగా మారుతుంది. కవిత ఒక ప్రశ్నగా మారుతుంది. కళ ఒక ప్రతిఘటనగా మారుతుంది.

గద్దర్ చూపిన మార్గం అదే...

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాలు కూడా అదే సందేశాన్ని చెబుతున్నాయి. ఆదివాసీ సమాజాలు తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి. కార్మికులు, ఉద్యోగస్తులు న్యాయమైన వేతనాల కోసం సమ్మెలు చేస్తున్నారు. రైతులు, ఆదివాసీలు, మహిళలు, విద్యార్ధులు, తమ జీవన హక్కుల కోసం వీధుల్లోకి వస్తున్నారు. అణచివేత శక్తులు ఎంత బలంగా ఉన్నా ప్రజల ఆశయాలను, ప్రజల పాటను ఆపలేవు. ఎందుకంటే ఆ పాట ఒక వ్యక్తి సృష్టి కాదు, అది కోట్లాది ప్రజల జీవితాల నుంచి పుట్టిన స్వరం. కాబట్టి ఈ కాలంలో మన బాధ్యత స్పష్టంగా ఉంది. ప్రజల హక్కుల కోసం పోరాడే స్వరాలను రక్షించాలి. ప్రజా సంస్కృతిని బలపరచాలి. ప్రజా సాంస్కతిక ఉద్యమం మరింత బలపడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. చివరికి చరిత్రను మార్చేది అధికారాల ఆధిపత్యం కాదు. ప్రజల గళం. ప్రజల పాట. ప్రజల పోరాటం. అదే ప్రజా యుద్ధనౌక గద్దర్ చూపిన మార్గం. అదే ప్రపంచ ప్రజల పోరాటం చెబుతున్న సత్యం.

(1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై కాల్పుల సందర్భంగా)

జి.వి. సూర్య కిరణ్,

స్థాపకుడు, కార్యదర్శి,

గద్దర్ ఫౌండేషన్

90007 41188

Next Story