- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాయి. శనివారం రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను ఇవి తాకినట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్ : నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాయి. శనివారం రాయలసీమలోని పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలను రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. కానీ మధ్యలో ఏర్పడే తుఫాను వంటి పరిస్థితుల కారణంగా ఈ లోటును కొంతవరకు భర్తీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈసారి రుతుపవనాల క్రమంలో కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి, మరికొన్ని రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడవచ్చని తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, వైఎస్సార్ కడప, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే, ఉత్తరాంధ్ర, కోస్తా తీరప్రాంత జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడతోపాటు కృష్ణా జిల్లాల్లో ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇక రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన ఎండలు కొనసాగనున్నట్టు అధికారులు తెలియ జేసారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని IMD వెల్లడించింది.






