గ్రామ పంచాయతీలకు పూర్వవైభవం.. స్టాంపు డ్యూటీ, సీనరేజ్ నిధులు నేరుగా గ్రామాలకే!

by Kema Shiva Kumar |

తెలంగాణలో గ్రామ పంచాయతీల బలోపేతానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది

గ్రామ పంచాయతీలకు పూర్వవైభవం.. స్టాంపు డ్యూటీ, సీనరేజ్ నిధులు నేరుగా గ్రామాలకే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామపంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నిధులు ఇవ్వడంతో పాటు అందుబాటులో ఉన్న నిధులను త్వరగా ఖర్చుచేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ఉపసర్పంచ్​ల స్థానంలో గ్రామకార్యదర్శికి చెక్ పవర్ అప్పగించాలని నిర్ణయించింది. ప్రతి పైసాకు ప్రభుత్వంపై ఆధారపడటం కాకుండా గతంలో ఉన్న విధానాలను తీసుకురావాలని నిర్ణయించింది. దీనికోసం అవసరమైన చట్టసవరణ చేయాలని భావిస్తున్నది. గ్రామపంచాయతీ సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో జమ చేయడం కాకుండా నేరుగా గ్రామపంచాయతీ బ్యాంకు ఖాతాలో జమచేసేలా చట్టసవరణ చేయాలని నిర్ణయించింది. తద్వారా త్వరగా నిధులను డ్రా చేసుకునే అవకాశాలు ఉంటాయని, ఆ నిధులను ఖర్చు చేయడానికి, వాటిని డ్రా చేయడానికి ఎక్కువ సమయం పట్టదని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్​చట్టం 2018లోని సెక్షన్​70(3)కు సవరణ చేయాలని నిర్ణయించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క ఆమోద ముద్రవేశారు.

గతంలో ఇలా..

ఇదివరకు గ్రామ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్లు జరిగితే సంబంధిత గ్రామపంచాయతీకి స్టాంపు డ్యూటీ ఫీజు ఖాతాలో జమ అయ్యేది. దీంతో పాటు ఇసుక, గ్రానైట్​ఇతర సినరేజ్​మొత్తంంలో కొంత భాగం వచ్చేది. అయితే గత బీఆర్ఎస్​ప్రభుత్వం వాటన్నంటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి బదాలాయించుకుని కొంత మొత్తాన్ని గ్రామ పంచాయతీలకు విడుదల చేసేది. కేంద్రంతో సమానంగా రాష్ట్రం పంచాయతీలకు నిధులు ఇస్తున్నామని నాటి సీఎం కేసీఆర్​ప్రకటించారు. అయితే దీనిపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ ప్రభుత్వం పంచాయతీలను బలోపేతం చేయడం, స్వంతంత్రంగా వ్యవహరించే విధంగా వారి నిధులను వారికే బదలాయించేలా నిర్ణయం తీసుకున్నది. తద్వారా గ్రామపంచాయతీలకు పూర్వవైభవం వచ్చే నిర్ణయం తీసుకున్నది. ప్రతి దానికి ప్రభుత్వంపై ఆధారపడటం, ప్రభుత్వం ఇస్తేనే నిధులు ఉండటం కాకుండా స్వంతంత్రంగా వ్యవహరించే విధంగా చేయనున్నారు. దీంతోపాటు గ్రామాల్లో పనిచేసే మల్టీపర్పస్​వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు, మండల, గ్రామ పంచాయతీ కంప్యూటర్​ఆపరేటర్ల వేతనాలను రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించేలా ప్రభుత్వం అనుమతిచ్చింది. తద్వారా వారికి రెగ్యులర్​గా వేతనాలు రావడం, పంచాయతీలపై అదనపు భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే వేలాది మందికి నేరుగా, సమయానికి వేతనాలు అందనున్నాయి.

Next Story