- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎఫెక్ట్.. అధిష్ఠానం చుట్టూ ఆశావహుల చక్కర్లు!
కేబినెట్ విస్తరణ జరగబోతోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తిన పర్యటనలకు తెర లేపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరిగే అవకాశాలున్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలువురు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హస్తినకు క్యూ కట్టారు. కాంగ్రెస్ పెద్దలను కలిసి మంత్రివర్గంలో చోటు కల్పించాలని విన్నవించుకుంటున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. మంత్రిపదవి కోసం ఆయన రాహుల్‌కు విజ్ఞప్తి చేసినట్టు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు మంత్రిపదవి ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు అనేక వేదికలపైన ఆయన స్పష్టంచేశారు. మంత్రిపదవి ఇవాల్సిందేనని అనేక సార్లు బహిరంగంగానే మాట్లాడారు. తాజాగా రాహుల్ గాంధీతో ఆయన భేటీ కావడంతో కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కే చాన్స్ ఉందంటూ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. కాగా, మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల వరుసగా ఢిల్లీ బాట పడుతున్న విషయం తెలిసిందే.
స్పీకర్, పరిగి ఎమ్మెల్యే సైతం..
కొద్దిరోజుల కిందట పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలని ఏకంగా తన ఫ్యామిలీతో రాహుల్ గాంధీని కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదని రామ్మోహన్ రెడ్డి రాహుల్‌కు వివరించినట్టు తెలిసింది. రాహుల్‌తో పరిగి ఎమ్మెల్యే భేటీ కావడంతో అటు కాంగ్రెస్, ఇటు రాష్ట్ర రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. మంత్రిపదవి కోసం అధిష్టాన పెద్దలను కలిసి నేతలు వినతి పత్రాలు ఇవ్వడం, విజ్ఞప్తులు చేస్తుండటంతో చాలా మంది ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంటూ ఉహాగానాల నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవడంతో మంత్రివర్గంలో చోటు ఖాయమంటూ చర్చ జరుగుతోంది. ప్రసాద్ కుమార్ గతంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఆయన రాహుల్ గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని స్పీకర్ రాహుల్‌ను కోరినట్లుగా సమాచారం.
ఆ తర్వాత ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కూడా కలిశారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి కోటాలోనే ఇబ్రహీంపట్నంఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రిపదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు కల్పించకపోవడంతో బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనితో పార్టీ నేతలు వెళ్లి ఆయన్ను బుజ్జగించారు. తాజాగా శనివారం కోహెడలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ దుట మల్ రెడ్డి రంగారెడ్డి వర్గీయులు ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో తమకు మంత్రిపదవి ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు ఢిల్లీ బాట పట్టే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.






