ఆర్టీసీలో ఎన్నికల రణరంగం.. గుర్తింపు సంఘం పోరుకు రంగం సిద్ధం!

by Kema Shiva Kumar |

తెలంగాణ ఆర్టీసీలో ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కార్మిక సంఘాల ఎన్నికల సందడి మొదలైంది.

ఆర్టీసీలో ఎన్నికల రణరంగం.. గుర్తింపు సంఘం పోరుకు రంగం సిద్ధం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో భాగంగా గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. రిటర్నింగ్ అధికారిగా నియమితులైన కార్మికశాఖ జాయింట్‌ కమిషనర్‌ సునీతాగోపాల్‌దాస్‌ ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది. కాగా, చివరి సారిగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు రెండేళ్ల కాలపరిమితితో 2016లో జరిగాయి.

తగ్గిన ఓటర్ల సంఖ్య..

చివరిసారిగా ఆర్టీసీలో 2016 జులై 19న ట్రేడ్ యూనియన్ ఎన్నిక జరిగింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) 10 రీజియన్లు, నాలుగు నాన్ ఆపరేషన్ యూనిట్లలో విజయం సాధించింది. ఖమ్మం రీజియన్ లో మాత్రం ఎస్ డబ్ల్యూఎఫ్ గెలిచింది. 8 ఆగస్టు 2016 నుంచి 7 ఆగస్టు 2018 వరకు గుర్తింపు సంఘం కాలపరిమితి కొనసాగింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిన అప్పటి కేసీఆర్ సర్కారు.. ఆ పనిచేయకపోవడంతో పాటు ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లకు గుర్తింపు రద్దుచేశారు. దాంతో అప్పటి నుంచి 8 ఏళ్ల పాటు ట్రేడ్ యూనియన్ ఎన్నికలనే మాటే లేకుండా పోయింది. 2018 ఎన్నికల్లో సుమారు 52వేల మంది ఆర్టీసీ కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. కాలక్రమంలో సుమారు 16వేల మంది కార్మికులు పదవీ విరమణ చేశారు. కానీ వారి స్థానాల్లో కొత్తగా నియామకాలు మాత్రం చేపట్టలేదు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికల్లో పాల్గొనే కార్మికుల సంఖ్య 36,120 ఉంది. వీరంతా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారని అధికారులు చెబుతున్నారు.

రీజియన్, రాష్ట్రస్థాయి ఒకేసారి

ప్రస్తుతం 12 రిజిస్టర్డ్ యూనియన్లు ఉన్నట్టు కార్మిక సంఘాలు చెబుతున్నా కార్మికశాఖ సిద్ధం చేసిన జాబితా ప్రకారమే పోటీకి అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి(క్లాస్-3), రీజియన్ స్థాయి(క్లాస్-6)లో రెండు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. రీజియన్ స్థాయిలో 10 ఉమ్మడి జిల్లాల రీజియన్లతో పాటు నాన్ ఆపరేషనల్ యూనిట్లు అయిన ఉప్పల్, మియాపూర్, కరీంనగర్ వర్క్ షాప్స్, బస్ భవన్ ల పరిధిలో క్లాస్-6 ఎన్నిక ఉంటుంది. రీజియన్, రాష్ట్రస్థాయి ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. మరోవైపు ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం రిటర్నింగ్ అధికారిని నియమించిన నేపథ్యంలో ఆర్టీసీ యంత్రాంగం వివరాలను సిద్ధం చేస్తోంది. మరోవైపు రిటర్నింగ్ అధికారిగా నియమితులైన కార్మికశాఖ జాయింట్‌ కమిషనర్‌ సునీతాగోపాల్‌దాస్‌ తనకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రాలేదని ‘దిశ’కు తెలిపారు. కాగా, విలీన ప్రక్రియనే ముందు చేపట్టాలని అన్ని కార్మిక సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం మాత్రం గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ముందుగా చేపడుతున్నది.

Next Story