- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోనమ్ వాంగ్చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు
నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో గత 21 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యా, పర్యావరణవేత్త, మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్చుక్ దీక్షను ఢిల్లీ పోలీసులు శనివారం భగ్నం చేశారు.

దిశ, హుజూరాబాద్ రూరల్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో గత 21 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యా, పర్యావరణవేత్త, మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్చుక్ దీక్షను ఢిల్లీ పోలీసులు శనివారం భగ్నం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ప్రజాస్వామ్యయుతంగా, అహింసా మార్గంలో దీక్ష చేస్తున్న ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పౌరుడితో కేంద్ర ప్రభుత్వం కనీస చర్చలు జరపకపోవడం పై పౌర సమాజం, మేధావుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఆవునూరి సమ్మయ్య కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలు నిరసిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన దీనిని ఖండిస్తూ ఆయన హుజూరాబాద్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య..
దేశంలో పాలన రాజ్యాంగబద్ధంగా సాగడం లేదని అనడానికి ఈ ఘటనే నిదర్శనమని జర్నలిస్ట్ ఆవునూరి సమ్మయ్య విమర్శించారు. నీట్ పరీక్షల లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు మానసిక క్షోభకు గురై బలవన్మరణాలకు పాల్పడుతుంటే, చలించిపోయిన వాంగ్చుక్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ దీక్షకు పూనుకున్నారే తప్ప, ఇందులో ఆయన వ్యక్తిగత స్వార్థం ఏమీ లేదని స్పష్టం చేశారు. "ప్రజాస్వామ్యంలో ఎన్నికైన పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ చర్చలకు రాకుండా, పోలీసులతో దీక్షను భగ్నం చేయించడం పాలకుల అహంకారానికి, నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోంది. అధికారంలో ఉన్నవారు ఒకటి గుర్తుంచుకోవాలి.. ఇక్కడ అధికారమేదీ శాశ్వతం కాదు, ఇది నియంతల కాలం అంతకన్నా కాదు." అని జర్నలిస్ట్ ఆవునూరి సమ్మయ్య పేర్కొన్నారు.
ఇందిరా గాంధీ నాటి చరిత్రను గుర్తు చేస్తూ..
ఈ సందర్భంగా సోనమ్ వాంగ్చుక్ కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని, గత చరిత్రను సమ్మయ్య గుర్తుచేశారు. లడ్డాక్‌కు చెందిన వాంగ్చుక్ తండ్రి సోనమ్ వాంగ్యాల్ 1975లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని, అప్పట్లో ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు. అప్పట్లో వాంగ్యాల్ ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నప్పుడు, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా దీక్షా శిబిరానికి వెళ్లి, ఆయన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారని గుర్తుచేశారు. నాడు ఇందిరా గాంధీ చూపిన ప్రజాస్వామ్య విలువలను, నేటి పాలకులు ప్రదర్శిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
వాంగ్చుక్‌కు అండగా నిలవాలి..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడి, సోనమ్ వాంగ్చుక్ లేవనెత్తిన న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిశీలించాలని, దేశ విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి, విద్యార్థులకు న్యాయం జరగడానికి వాంగ్చుక్ చేస్తున్న పోరాటానికి దేశ ప్రజలందరూ అండగా నిలవాలని జర్నలిస్ట్ ఆవునూరి సమ్మయ్య ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.






