వేసవి దుక్కులతోనే భూసారం.. పెట్టుబడి తగ్గి రైతుకు దక్కనున్న మేలు!

by Malleboina Mahesh |

వేసవి దుక్కులతో నేల ఆరోగ్యం మెరుగుపడి, చీడపీడల నివారణ సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఏటవాలు దుక్కులతో నీటి నిల్వ పెరిగి సాగు ఖర్చు తగ్గుతుంది.

వేసవి దుక్కులతోనే భూసారం.. పెట్టుబడి తగ్గి రైతుకు దక్కనున్న మేలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంటకోత అనంతరం వేసవి ఎండలో భూమిని లోతుగా దున్నడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, చీడపీడల నివారణ, నీటి నిల్వ, పెట్టుబడి తగ్గుదల, దిగుబడి పెరుగుదల వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. నేల గుల్ల బారి వేర్ల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు, కలుపు మొక్కలు, పురుగుల గుడ్లు, లార్వాల సహజ నియంత్రణ, నేలలో సేంద్రియ కర్బనం, మిత్ర సూక్ష్మజీవుల పెరుగుదల ఉంటుంది. వర్షపు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుదల, సాగు ఖర్చులో తగ్గుదల అవకాశం, పంట దిగుబడిలో పెరుగుదల సాధ్యం అవుతుందని తెలిపింది.

వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం వేసవి దుక్కులతో నేల గట్టిపడిన పొరలు పగిలి గాలి ప్రసరణ మెరుగుపడుతుంది. భూమిలోని పోషకాలు సమానంగా కలవడంతో మొక్కల వేర్లు లోతుగా పెరిగి పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తాయి. వేసవి ఎండ తీవ్రత కారణంగా నేలలో దాగి ఉండే హానికర పురుగుల గుడ్లు, లార్వాలు, కోశస్థ దశలు బయటకు వచ్చి ఎండకు నశిస్తాయి. పక్షులు వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల సహజ నియంత్రణ జరుగుతుంది. దీంతో పురుగుల మందుల వినియోగం గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంది.

రైతులకు మేలు

ఎండు తెగుళ్లు, వేరు కుళ్లు వంటి వ్యాధులకు కారణమయ్యే శిలీంధ్ర బీజాలు అధిక ఉష్ణోగ్రతల వల్ల నశించి పంట కాలంలో వ్యాధుల తీవ్రత తగ్గుతుందని తెలిపింది. వేసవి దుక్కుల వల్ల భూమిలోని పంట అవశేషాలు, ఎండు గడ్డి తదితరాలు మట్టిలో కలిసిపోయి క్రమంగా సేంద్రియ కర్భన పదార్థంగా మారతాయి. దీనివల్ల నేలలో సేంద్రియ కర్బనం పెరిగి భూసారం మెరుగుపడుతుంది. మిత్ర సూక్ష్మజీవుల వృద్ధికి కూడా ఇది అనుకూల పరిస్థితులు కల్పిస్తుంది. వేసవి దుక్కుల వల్ల భూమిలో గాలి ప్రసరణ, తేమ నిల్వ, సేంద్రియ పదార్థాల కలయిక మెరుగుపడటంతో వానపాములకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో వానపాముల సంతతి పెరిగి నేల మరింత గుల్లగా మారుతుంది.

వానపాములు భూమిలో సహజంగా సొరంగాలు తయారు చేయడం వల్ల నీరు, గాలి సులభంగా లోనికి చేరి భూసారం పెరగడానికి సహాయపడుతుంది. నీటి యాజమాన్యంలో కూడా వేసవి దుక్కులు కీలక పాత్ర పోషిస్తాయి. దుక్కి చేసిన భూమి గుల్ల బారడం వల్ల తొలి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించుకుంటుంది. దీనివల్ల భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంట నిలబడే అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా కూడా ఈ పద్ధతి రైతులకు మేలు చేస్తుంది. కలుపు నివారణ, పురుగుమందుల ఖర్చులు తగ్గడం వల్ల రైతులకు ఖర్చు ఆదా అవుతుంది. అదనంగా దిగుబడి పెరగడం ద్వారా మరింత ఆదాయం పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

ఏటవాలుగా దున్నాలి

రైతులు పంట కోత పూర్తయిన వెంటనే భూమిలో స్వల్ప తేమ ఉన్నప్పుడు దుక్కులు చేయాలని, భూమిని లోతుగా దున్నడం మంచిదని డైరెక్టర్ గోపి తెలిపారు. వీలైతే భూమిని ఏటవాలుగా దున్నడం ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకుతుందన్నారు. దుక్కుల అనంతరం పంట అవశేషాలను భూమిలో కలపడం ద్వారా సేంద్రియ కర్బనం పెరుగుతుంది. వేసవి దుక్కులను కేవలం ఒక వ్యవసాయ పనిగా కాకుండా, భూమి ఆరోగ్యాన్ని కాపాడే దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించాలని పేర్కొన్నారు. ఈ పద్ధతిని పాటించడం ద్వారా భూసారం పెరగడంతో పాటు సాగు ఖర్చు తగ్గి, లాభసాటి వ్యవసాయం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

Next Story