- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచు తుఫానుతో అమెరికా అతలాకుతలం..10,000 విమానాలు రద్దు, స్తంభించిన జనజీవనం
అమెరికా ఈశాన్య రాష్ట్రాలను 'బాంబ్ సైక్లోన్' వణికిస్తోంది. భారీ హిమపాతం కారణంగా 10,000 విమానాలు రద్దయ్యాయి, 6 లక్షల ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాను అతలాకుతలం చేస్తుంది. రెండు వారాల కిందట బీభత్సం సృష్టించగా.. ఆ భయానక పరిస్థుల నుంచి కోలుకోక ముందే మరోసారి మంచు తుఫాను విరుచుకుపడింది. ముఖ్యంగా అమెరికా ఈశాన్య రాష్ట్రాలపై మంచు తుఫాను 'బాంబ్ సైక్లోన్' రూపంలో విరుచుకుపడుతోంది. న్యూయార్క్, బోస్టన్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్ వంటి ప్రాంతాల్లో భారీ హిమపాతం నమోదైంది. ముఖ్యంగా రోడ్ ఐలాండ్‌లో దాదాపు 3 అడుగుల మేర మంచు కురిసి గత దశాబ్దాల రికార్డులను తిరగరాసింది. గంటకు 70 మైళ్ల వేగంతో వీస్తున్న బలమైన గాలుల కారణంగా రహదారులపై ఏమీ కనిపించని (White-out) పరిస్థితులు ఏర్పడటంతో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ఈ ప్రకృతి వైపరీత్యం రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. భద్రతా కారణాల దృష్ట్యా శనివారం నుంచి మంగళవారం వరకు దాదాపు 10,000 విమాన సర్వీసులను విమానయాన సంస్థలు రద్దు చేశాయి. న్యూయార్క్, బోస్టన్ వంటి ప్రధాన నగరాల్లో రహదారులపై వాహనాల రాకపోకలపై అధికారులు కఠిన నిషేధం విధించారు. ఆమ్ట్రాక్ రైలు సర్వీసులు కూడా నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలోనే చిక్కుకుపోయారు.
తుఫాను ధాటికి విద్యుత్ లైన్లు తెగిపోవడంతో సుమారు 6 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలు అంధకారంలో మునిగిపోయాయి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం హెచ్చరించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికే సెలవు ప్రకటించగా, మంచును తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. పరిస్థితులు చక్క బడటానికి మరో రెండు రోజులు పట్టవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.






