మన్నెవారి పల్లి వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ పునఃప్రారంభం!

by Malleboina Mahesh |

నిలిచిపోయిన ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ పనులు మళ్లీ ప్రారంభం! డీబీఎం పద్ధతిలో మన్నెవారి పల్లి వద్ద పనులను వేగవంతం చేసిన అధికారులు. నల్లగొండ రైతాంగంలో హర్షం.

మన్నెవారి పల్లి వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ పునఃప్రారంభం!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel) ప్రమాదం గత సంవత్సరం ఫిబ్రవరిలో జరగడం పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి టన్నెల్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల్లో కొంతమంది మృతదేహాల ఆచూకీ కూడా లభ్యం కాలేదు. కానీ ఈ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం (State Govt) వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మన్నెవారి పల్లి వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ పునః ప్రారంభించినట్లు (SLBC tunnel reopened) తెలుస్తుంది. దీంతో నల్లగొండ జిల్లా రైతాంగం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎస్ఎల్బీసీ (SLBC - శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) సొరంగం పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది.

గతేడాది ఫిబ్రవరి 22న టన్నెల్‌లో జరిగిన ప్రమాదం కారణంగా నిలిచిపోయిన పనులు, సుమారు ఏడాది కాలం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. గత ఫిబ్రవరి 18న మన్నెవారి పల్లి అవుట్‌లెట్‌ వైపు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి అధికారికంగా పనులను పునః ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు పనులు గతంలో నిలిచిపోవడంతో జిల్లాలోని సాగునీటి సరఫరా పై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఇప్పుడు పనులు మొదలవ్వడంతో ఈ ప్రాంత రైతాంగంలో కొత్త ఆశలు చిగురించాయి.

సొరంగం పనులను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రస్తుతం డీబీఎం (DBM - డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్) పద్ధతిని అనుసరిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ డ్రిల్లింగ్ పనులను పూర్తి చేసి, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని మళ్లించే ఈ సొరంగం పూర్తయితే, నల్లగొండ జిల్లాలోని లక్షలాది ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ, మళ్లీ ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Next Story