హైదరాబాద్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' మరో ఘనత

by Muthe.Rajitha |

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది.

హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ మరో ఘనత
X

దిశ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. దేశానికి చెందిన ప్రయివేట్ శాటిలైట్స్ అంతరిక్షంలోకి చేరేందుకు కొత్త దారులు పడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి చెందిన 'స్కైరూట్ ఏరోస్పేస్' అంకుర సంస్థ తన తొలి శాటిలైట్ ను శ్రీహరికోట షార్ ఆధ్వర్యంలో పంపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. అంతేకాదు భారత్ నుంచి అంతరిక్షానికి వెళుతున్న తొలి ప్రయివేట్ ఉపగ్రహం కూడా ఇదే కావడం విశేషం. 2018 లో హైదరాబాద్ వేదికగా మొదలైన స్కైరూట్ ఏరోస్పేస్ అంకుర సంస్థ 2022 లో కూడా విక్రమ్-S అనే అతి చిన్న ఉపగ్రహాన్ని స్పేస్ లోకి పంపింది. తాజాగా శ్రీహరికోటలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు చెందిన 'ఫస్ట్ లాంచ్ ప్యాడ్' వద్ద తమ ప్రతిష్టాత్మక 'విక్రమ్-1' (Vikram-I) రాకెట్ మొదటి దశను (First Stage) విజయవంతంగా అమర్చింది. భారతదేశంలో ప్రైవేట్‌ రంగానికి చెందిన ఒక ఆర్బిటల్‌ రాకెట్‌ను ఇస్రో లాంచ్ ప్యాడ్‌పై ప్రయోగం కోసం అమర్చడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. ఇందుకు సంబంధించిన ప్రత్యేక చిత్రాలను స్కైరూట్‌ సంస్థ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా పంచుకుంది.

సిద్దమవుతున్న తొలి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ రాకెట్‌

లాంచ్ ప్యాడ్ వద్ద విక్రమ్-I రాకెట్ రూపుదిద్దుకుంటోందని స్కైరూట్‌ ఏరోస్పేస్ ప్రతినిధులు వెల్లడించారు. రాకెట్ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని, అందుకే సాంకేతిక నిపుణుల సమక్షంలో ప్రతి దశను ఎంతో జాగ్రత్తగా అమర్చి, తుది ప్రయోగానికి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లోనే విక్రమ్‌-1 రాకెట్‌తో తమ మొట్టమొదటి కక్ష్య ప్రయోగాన్ని చేపట్టేందుకు అంతా సిద్ధం చేస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

చిన్న ఉపగ్రహాలే లక్ష్యం

ప్రస్తుత అంతరిక్ష మార్కెట్‌లో చిన్న ఉపగ్రహాలకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని స్కైరూట్ ఈ రాకెట్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. వాణిజ్యపరంగా తక్కువ బరువు గల చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్ష్యలోకి అత్యంత సురక్షితంగా, తక్కువ ఖర్చుతో తీసుకువెళ్లడానికి ఈ విక్రమ్-1 రాకెట్‌ను రూపొందించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, అంతర్జాతీయ ప్రైవేట్ అంతరిక్ష వాణిజ్య మార్కెట్‌లో హైదరాబాద్ సంస్థల ప్రతిష్ట మరింత ఎత్తుకు చేరడం ఖాయమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Next Story