పోక్సో నిందితుడి మారణహోమం.. ఏకంగా ఆరుగురి దారుణ హత్య

by Muthe.Rajitha |   (  Updated:2026-07-11 02:02:52  IST  )

రంగారెడ్డి జిల్లాలో శనివారం తెల్లవారుజామున అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది.

పోక్సో నిందితుడి మారణహోమం.. ఏకంగా ఆరుగురి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో శనివారం తెల్లవారుజామున అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై పోక్సో (POCSO) కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఫిర్యాదు చేసిన కుటుంబంతోపాటు, అడ్డువచ్చిన కన్నబిడ్డలను, భార్యను కూడా వదలకుండా ఏకంగా ఆరుగురిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. షాబాద్‌ మండల కేంద్రంలోని దైవాలగూడ గ్రామంలో జరిగిన ఈ ఊచకోత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

కేసు నేపథ్యం.. బెయిల్‌పై వచ్చి దారుణం!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దైవాలగూడకు చెందిన రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం స్థానికంగా ఉండే ఒక మైనర్ బాలికను వేధించాడు. దీనిపై సదరు బాధిత బాలిక, ఆమె తల్లి కలిసి గత మే 16న షాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్‌కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఇటీవలె జైలు నుండి బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్‌కుమార్, తనను జైలుకు పంపారనే కక్షతో సదరు కుటుంబంపై పగ పెంచుకున్నాడు.

కాలరాత్రి.. ఆరుగురి ప్రాణాలు బలి

శనివారం తెల్లవారుజామున చీకటిగా ఉన్న సమయంలో పక్కా ప్రణాళికతో కక్ష తీర్చుకోవడానికి బయలుదేరాడు. నిద్రిస్తున్న బాధితులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఈ క్రూరమైన దాడిలో క్రింది ఆరుగురు ఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు. స్థానికులు తేరుకునేలోపే బాధిత, బాలిక, బాలిక తల్లి, బాలిక నానమ్మ, నిందితుడి భార్య, నిందితుడి మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు శవాలుగా మారారు. తన పగకు కారణమైన బాలిక కుటుంబాన్ని మట్టుబెట్టడమే కాకుండా, తనకు అడ్డువచ్చిన తన సొంత భార్యను, పసికందులని కూడా చూడకుండా ఇద్దరు కన్నపిల్లలను నిందితుడు అతి కిరాతకంగా చంపేయడం అందరినీ కలచివేస్తోంది.

తల్లిదండ్రులకు చెప్పడంతో వెలుగులోకి..

ఈ సామూహిక హత్యలు చేసిన అనంతరం నిందితుడు రాజ్‌కుమార్‌ నేరుగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తాను చేసిన ఘోరాన్ని వివరించాడు. కొడుకు చేసిన పనికి షాక్‌కు గురైన తల్లిదండ్రులు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఒకేచోట ఆరుగురు హత్యకు గురయ్యారనే వార్తతో సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది. సమాచారం అందిన వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (CP) తరుణ్‌ జోషి, డీసీపీ (DCP) యోగేష్‌ గౌతమ్‌లు భారీ బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించారు. కాగా హత్యల అనంతరం తాను కూడా చనిపోతున్నట్టు బంధువులకు ఫోన్లు చేసిన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం. ప్రత్యేక పోలీసు బృందాలు నిందితున్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Next Story