- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాయిస్ క్లోనింగ్‌తో నిలువుదోపిడీ.. లక్షలు కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్లు!
ఏఐ వాయిస్ క్లోనింగ్‌తో లక్షలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు.. మోసపోతే వెంటనే 1930 కి కాల్ చేయాలన్న సైబర్ క్రైమ్ డీసీపీ!

దిశ, తెలంగాణ బ్యూరో : ‘అమ్మా.. నేనే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది. నా స్నేహితుడు సీరియస్ కండిషన్‌లో ఉన్నాడు. అర్జంటుగా ఆసుపత్రికి రూ. 50 వేలు కట్టాలి. నేను డ్రైవింగ్‌లో ఉన్నాను, గూగుల్ పే పనిచేయట్లేదు. వెంటనే ఈ నంబర్‌కు డబ్బులు పంపు.. ప్లీజ్..’ అచ్చం మీ అబ్బాయి లేదా అమ్మాయి గొంతుతోనే అవతలి నుంచి ఫోన్ వస్తే, ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు? ప్రాణం పోయినంత పనై, అడిగిన వెంటనే డబ్బులు పంపేస్తారు. తీరా కాసేపయ్యాక అసలు నంబర్‌కు ఫోన్ చేస్తే.. ‘నేను బానే ఉన్నాను, అసలు నేను ఫోనే చేయలేదు’ అని సమాధానం వస్తుంది. అప్పుడు కానీ తెలియదు.. తాము నిలువునా మునిగిపోయామని.. ఇవే ఇప్పుడు తెలంగాణలో సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్న వాయిస్ క్లోనింగ్ ప్రకంపనలు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తప్పులేదు కానీ, అది మనల్ని దగా చేసే అవకాశం ఉందని గుర్తించాలి. విచక్షణతో వ్యవహరించడమే సైబర్ నేరగాళ్ల నుంచి మనల్ని రక్షించే కవచం.
ఏమిటీ వాయిస్ క్లోనింగ్..?
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది మానవాళికి ఎన్నో ఉపయోగాలు చేకూరుస్తున్నప్పటికీ నేరగాళ్ల చేతిలో అది ఒక ప్రమాదకర ఆయుధంగా మారింది. గతంలో డీప్ ఫేక్ వీడియోలతో బురిడీ కొట్టించిన వారు, ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన వాయిస్ క్లోనింగ్ వైపు మళ్లారు. కేవలం మూడు నుంచి ఐదు సెకన్ల పాటు మీ గొంతును రికార్డ్ చేయగలిగితే చాలు.. ఏఐ సాఫ్ట్‌వేర్ల సాయంతో అచ్చం మీలాగే మాట్లాడే వాయిస్ మోడల్‌ను ఈ కేటుగాళ్లు సృష్టించేస్తున్నారు. మీరు మాట్లాడే యాస, శ్వాస తీసుకునే విధానం, భావోద్వేగాలను కూడా ఈ సాఫ్ట్‌వేర్లు అచ్చుగుద్దినట్లు అనుకరిస్తున్నాయి. దీంతో అవతలి వ్యక్తి మాట్లాడుతున్నది మనిషా లేక యంత్రామా? అని గుర్తుపట్టడం సామాన్యులకు అసాధ్యంగా మారుతోంది.
మాయాజాలం మొదలవుతుందిలా..
నేరగాళ్లు తమ వేట కోసం సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. మనం సరదాగా ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో పోస్ట్ చేసే రీల్స్ లేదా వీడియోల నుండి మన గొంతును సేకరిస్తారు. మరికొన్నిసార్లు అపరిచిత నంబర్ల నుంచి కాల్ చేసి, ఏవేవో ఆఫర్లు ఉన్నాయని నమ్మబలికి మీతో మాటలు కలుపుతారు. ఆ కొద్ది నిమిషాల సంభాషణనే రికార్డ్ చేసి, క్లోనింగ్ సాఫ్ట్‌వేర్‌కు ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత మీ సన్నిహితుల వివరాలను సేకరించి, వారికి ఫోన్లు చేయడం ప్రారంభిస్తారు. వారు ఫోన్ చేసినప్పుడు మీ గొంతు స్పష్టంగా వినిపించేలా చేసి, నేపథ్యంలో ఆస్పత్రి శబ్దాలు లేదా పోలీస్ స్టేషన్ గందరగోళం వినిపించేలా ఎఫెక్ట్స్ కూడా జోడిస్తారు.
ఆందోళనకు గురి చేసి..
ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రం భయం. ఎవరైనా సాధారణంగా డబ్బులు అడిగితే మనం ఆరా తీస్తామని నేరగాళ్లకు తెలుసు. అందుకే వారు అత్యవసరం అనే అంశాన్ని ఆయుధంగా చేసుకుంటారు. ‘నేను యాక్సిడెంట్ చేశాను, పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు.. వెంటనే డబ్బులు కడితేనే వదులుతారు’.. ‘ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ బయట ఉన్నాను, మందులకు డబ్బులు కావాలి’ వంటి కట్టుకథలతో బాధితులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తారు. కంగారులో ఉన్న బాధితులు తార్కికంగా ఆలోచించే శక్తిని కోల్పోయి, అవతలి వారు చెప్పిన యూపీఐ ఐడీలకు లేదా బ్యాంకు ఖాతాలకు అడిగినంత నగదు బదిలీ చేసేస్తున్నారు.
అపరిచిత నెంబర్ అయితే నమ్మొద్దు.. : వి.అరవింద్ బాబు, డీసీపీ సైబర్ క్రైమ్స్
మీ సన్నిహితుల గొంతుతో ఫోన్ కాల్ వచ్చినా సరే, అది అపరిచిత నెంబర్ అయితే వెంటనే నమ్మకండి. గొంతు మీ వారికి దగ్గరగా ఉన్నా.. వెంటనే ఆ ఫోన్ కట్ చేసి, మీ దగ్గర ఉన్న వారి పాత మొబైల్ నంబర్‌కు కాల్ చేసి నిర్ధారించుకోండి. నేరగాళ్లు కొత్త నంబర్ల నుంచి కాల్ చేసి.. నా ఫోన్ పగిలిపోయింది, అందుకే స్నేహితుడి ఫోన్ నుంచి చేస్తున్నా అని సాకులు చెబుతారు. అలాంటి వాటికి లొంగిపోవద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే, వారు నిజంగా మీ వారేనా? అని తెలుసుకోవడానికి.. కేవలం మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించండి. సోషల్ మీడియలో మీ వ్యక్తిగత వీడియోలు, ఆడియోలను పబ్లిక్ మోడ్‌లో ఉంచకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మోసపోయామని గుర్తిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలి.. లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరాల్లో మొదటి రెండు గంటలు అత్యంత కీలకం, ఆ సమయంలో ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది.






