అప్‌డేట్ కాని సర్కారు వెబ్‌సైట్లు

by Ratna Kumari |

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పాలకులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి.

అప్‌డేట్ కాని సర్కారు వెబ్‌సైట్లు
X

దిశ నాగర్‌కర్నూల్ : ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పాలకులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో వివిధ శాఖల ఉన్నతాధికారులు బదిలీలపై వెళ్లి నెలలు గడుస్తున్నా.. జిల్లా అధికారిక వెబ్‌సైట్ (nagarkurnool.telangana.gov.in) లో మాత్రం పాత అధికారుల పేర్లు, పాత ఫోన్ నెంబర్లే దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అసలు యాక్టివ్‌గా లేకపోవడం గమనార్హం.

మారిన అధికారులు.. మారని వివరాలు ..

జిల్లాలో ఇటీవల పలు శాఖలకు సంబంధించిన కీలక అధికారులు బదిలీ అయ్యారు. వారి స్థానంలో కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించారు. అయితే, జిల్లా అధికారిక పోర్టల్‌ను నిర్వహించే ఐటీ విభాగం గానీ, సంబంధిత శాఖల అధికారులు గానీ వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. అత్యవసర సమాచారం లేదా ఫిర్యాదుల కోసం ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తే.. అక్కడ గతంలో పనిచేసిన అధికారుల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు ఉండటంతో అయోమయానికి గురవుతున్నారు. ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు.. మేము బదిలీపై వెళ్ళిపోయాం అనే సమాధానాలు వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సోషల్ మీడియాకు అధికారుల రాంరాం...

ఒకప్పుడు ప్రభుత్వ శాఖల ప్రగతిని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి ట్విట్టర్ (X), ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలను అధికారులు విస్తృతంగా ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ ట్విట్టర్ అకౌంట్లు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. మున్సిపల్, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ ఇలా మరికొన్ని అకౌంట్లు అప్‌డేట్లకు దూరంగా ఉంటున్నాయి. ప్రజలు తమ సమస్యలను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నా వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జిల్లా కేంద్రానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నతాధికారులకు సమస్యను విన్నవించుకుందామని వెబ్‌సైట్ చూస్తే అన్నీ తప్పుడు నెంబర్లే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసినా స్పందన లేదు. డిజిటల్ ఇండియా అంటే ఇదేనా?" అని జిల్లాకు చెందిన పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే అన్ని శాఖల కొత్త అధికారుల వివరాలతో కూడిన వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేయించాలని, అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Next Story