- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ‘రైతు బీమా’ కనుమరుగు..! ఇకపై రేషన్ కార్డ్ ఉన్న కుటుంబ పెద్దకే లబ్ధి?
తెలంగాణలో 'రైతు బీమా' రద్దు కానుందనే ప్రచారం జరుగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్న రైతుబీమా పథకం కనుమరుగవుతుందనే ప్రచారం జరుగుతోంది. కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రభుత్వం అమలు చేసేందుకు ప్లాన్చేస్తోంది. నవంబర్19న ఇందిరా గాంధీ జయంతి రోజున పథకానికి శ్రీకారం చుట్టనుండగా ఇప్పటికే పథకానికి సంబంధించిన విధి విధానాలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 2018లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఏటా 25 వేల కుటుంబాలకు పరిహారం అందుతుంది. రైతులపై భారం పడకుండా ప్రభుత్వం ప్రీమియం ఏటా ఆగస్టు 14న చెల్లిస్తోంది. పథకం ప్రారంభంలో 31.25 లక్షల మంది అర్హులు ఉండగా ప్రస్తుత ఏడాదిలో 42.16 లక్షల మందికి వర్తిస్తోంది. అయితే ఈ పథకంలో ఏటా కొత్తగా చేరే రైతులకంటే అనర్హుల తొలగింపు, మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా 59 ఏళ్లుపైబడిన రైతులు పథకానికి దూరమవుతుండగా భూమి పంపకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక రైతు ఆకస్మాత్తుగా మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల బీమాను కేసీఆర్ అమలు చేయగా ఈ పథకం రద్దు చేయకుండా పాత పద్ధతిలోనే కొనసాగించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఏటా బీమా కోసం చెల్లిస్తున్న ప్రీమియంలో 70 శాతం చెల్లింపుకు సరిపోగా 30 శాతం మిగులుతుంది.
ఇందిరమ్మ బీమా..
రాష్ట్రం ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వివిధ కారణాలతో కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లించనుంది. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు కుటుంబ జీవిత బీమా అమలు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. దీనికోసం బడ్జెట్లో రూ.4వేల కోట్లు కూడా కేటాయించారు. ఇందిరమ్మ బీమా పథకం కుటుంబంలో కేవలం ఒక్కరికే వర్తిస్తోంది. అది కూడా కుటుంబ పెద్దకు మాత్రమే వర్తించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్టు, రేషన్‌కార్డు కలిగిన వారికి మాత్రమే అమలు చేయనున్నట్టు తెలిసింది. రైతుబీమా పథకం కుటుంబంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఇందిరమ్మ బీమా పథకం మాత్రం కుటుంబంలో ఒక్కరికే వర్తించనుంది. ఇందిరమ్మ బీమా అమలు చేస్తే ఎంతమందికి పరిహారం అందుతుందనేది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది.
ఆగస్టు 14తో లాస్ట్..
ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రారంభించే ఇందిరమ్మ బీమా నవంబర్19 ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. రైతు బీమా గడువు ఆగస్టు 14తో ముగియనుంది. ఈరెండు పథకాల మధ్య నాలుగు నెలల వ్యవధి ఉంటుంది. ఈమధ్య కాలంలో మరణించిన రైతులకు పరిహారం పరిస్థితి ఏమిటనే విషయం ఆందోళన కలిగిస్తోంది. అప్పటివరకు ప్రభుత్వం రైతు బీమా పథకం ప్రీమియం చెల్లిస్తుందా? పథకం పక్కకు పెడుతుందా? అనే అంశంపై ప్రభుత్వ వర్గాల్లో క్లారిటీ లేదు. ఇప్పటివరకు ఏటా సుమారు 18 వేల నుంచి 25 వేల మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం అందేది. ఈ నాలుగు నెలల పాటు బీమా పథకం అందకుంటే ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాయి. రేవంత్ ప్రభుత్వం నాలుగు నెలలకు సంబంధించిన ప్రీమియం చెల్లించాలని రైతులు సంఘాలు సూచనలు చేస్తున్నాయి. అన్నదాతకు ఎంతో ఆసరాగా నిలిచే పథకం రద్దుపై పాలకులు ఆలోచించాలని రైతులు కోరుతున్నారు.






