‘శివకార్తికేయన్ నాకు అసలు పోటీ కాదు’.. జీవా సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

కోలీవుడ్ నటుడు జీవా(Jiiva) ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు.

‘శివకార్తికేయన్ నాకు అసలు పోటీ కాదు’.. జీవా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు జీవా(Jiiva) ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ‘ఆసాయ్ ఆసాయ్’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన, హీరోగా మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకూ జీవా బాగా దగ్గరయ్యారు. స్నేహితుడు, భరత్ అనే నేను, రంగం, ఆంజనేయులు, నమో వెంకటేష, దేశముదురు వంటి చిత్రాలతో తెలుగులోనూ బలమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదించారు. గత ఏడాది ‘అగత్యా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జీవా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన తలైవర్ తండి తలైమైయిల్ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తనకు అసలు పోటీనే కాదని జీవా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. “నేను శివకార్తికేయన్‌ను నా ప్రత్యర్థిగా ఎప్పుడూ చూడలేదు. కానీ అతని పీఆర్ టీమ్‌తో మాత్రం పోటీ ఉందని భావిస్తాను. డబ్బు తీసుకుని నిరంతరం అతన్ని ప్రమోట్ చేయడంలో వాళ్లు బిజీగా ఉంటారు. అందుకే వారి విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను” అంటూ జీవా వ్యాఖ్యానించారు. అలాగే శివకార్తికేయన్‌ను తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న ఆయన, “నా కాలేజీ మొదటి రోజునే నా సినిమాలన్నీ చూశానని అతను చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది. మా సినిమాలు చూసే ఎదిగిన తరం వాళ్లని” అన్నారు.

అందుకే తనకు ఎలాంటి అసురక్షిత భావన లేదని స్పష్టం చేశారు. తనకు నిజమైన పోటీగా ధనుష్, శింబు, రవిమోహన్‌లను మాత్రమే చూస్తానని ఆయన స్పష్టం చేశారు. అలాగే, నాతో కలిసి పని చేసిన అనేక మంది దర్శకులు ఇప్పుడు శివకార్తికేయన్, విజయ్ సేతుపతితో సినిమాలు చేస్తున్నారని, ఇది పరిశ్రమ అభివృద్ధికి సంకేతమని పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చానని, దాదాపు 14 మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన గర్వం తనకుందని జీవా తెలిపారు. ప్రస్తుతం జీవా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి.

Next Story