సిరిసిల్ల పోలీసుల సరికొత్త రికార్డ్.. మొబైల్ రికవరీలో రాష్ట్రంలోనే నంబర్ వన్!

by Jakkula.Mamatha |

సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మొబైల్ ఫోన్ రికవరీలో మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు.

సిరిసిల్ల పోలీసుల సరికొత్త రికార్డ్.. మొబైల్ రికవరీలో రాష్ట్రంలోనే నంబర్ వన్!
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మొబైల్ ఫోన్ రికవరీలో మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. 76.8 శాతం మొబైల్ రికవరీ రేటుతో వరుసగా మూడో ఏడాది రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సెల్‌ఫోన్ రికవరీ మేళాలో గత కొన్ని రోజులుగా పోయిన లేదా చోరీకి గురైన సుమారు రూ.13 లక్షల విలువైన 90 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ మొబైల్ ఫోన్లు గుర్తించి రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుతం మొబైల్ ఫోన్ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలు, డిజిటల్ చెల్లింపుల వివరాలు భద్రపరిచే ప్రధాన సాధనంగా మారిందన్నారు. ఫోన్ పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసి మొబైల్‌ను బ్లాక్ చేయడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా విక్రేత నుంచి బిల్లు లేదా రసీదు తీసుకోవాలని, దొంగిలించబడిన ఫోన్లు కొనుగోలు చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అలాగే మొబైల్ ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు లేదా అనధికారిక దుకాణాలకు విక్రయించకుండా, అధికారిక ఎక్స్చేంజ్ లేదా గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే విక్రయించాలని సూచించారు. సీఈఐఆర్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో విశేష కృషి చేసిన ఐటీ కోర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి దొరకడంతో బాధితులు జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్‌ఐ సురేష్, ఐటీ కోర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, ఆర్‌ఐ యాదగిరి, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story